పాక్ బౌలర్ ‘చకింగ్’ ఇష్యూ.. అంపైర్‌తో స్టార్ క్రికెటర్ పంచాయితీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-26 09:16:03  IST  )

‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

పాక్ బౌలర్ ‘చకింగ్’ ఇష్యూ.. అంపైర్‌తో స్టార్ క్రికెటర్ పంచాయితీ
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తానీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తన విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో శుక్రవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్మాన్ తారిఖ్ తనదైన ప్రత్యేక స్టాప్-అండ్-పాజ్.. సైడ్-ఆర్మ్ యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. ట్రెంట్ రాకెట్స్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్న సమయంలో తారిఖ్ ఆఫ్ స్టంప్‌కు వెలుపల వేసిన బంతిని డేవిడ్ ఎడ్జ్ చేయగా, వికెట్ కీపర్ సులభమైన క్యాచ్ అందుకున్నాడు.

అంపైర్‌తో టిమ్ డేవిడ్ వాగ్వాదం..

అంపైర్ డేవిడ్‌ను ఔట్‌గా ప్రకటించగా.. అతను ఆ నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఉస్మాన్ తారిఖ్ వేసింది లీగల్ డెలివరీ కాదని, అది చకింగ్ అంటే బంతిని విసిరేయడం అని.. కాబట్టి దానిని నో-బాల్‌గా ప్రకటించాలని అంపైర్‌తో వాదించాడు. ఈ నిర్ణయంపై సమీక్షకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, నిబంధనల ప్రకారం అతనికి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో అసంతృప్తితోనే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక ఎంసీసీ లా 21.2 ప్రకారం.. బౌలర్ బంతిని విసిరే సమయంలో భుజం ఎత్తు నుంచి బంతిని విడుదల చేసే వరకు మోచేతిని నిటారుగా మోచేయి చాచి బంతిని త్రో చేయకూడదు. మైదానంలోని ఇద్దరు అంపైర్లలో ఎవరైనా బౌలర్ బంతిని విసిరినట్లుగా భావిస్తే, దానిని నో-బాల్‌గా ప్రకటించే అధికారం వారికి ఉంటుంది.

వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ ఇదే: https://x.com/AjayJadeja171/status/2081040469191229513?s=20

Next Story