భద్రాద్రి కొత్తగూడెంలో అట్టహాసంగా 18వ ఈశా గ్రామోత్సవం

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని పోలీస్ గ్రౌండ్‌లో 18వ ఈశా గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెంలో అట్టహాసంగా 18వ ఈశా గ్రామోత్సవం
X

దిశ, దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని పోలీస్ గ్రౌండ్‌లో 18వ ఈశా గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 25న నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో 350 మందికి పైగా పురుషుల వాలీబాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ములకపాడు సర్పంచ్ తులసమ్మ, దుమ్ముగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) టి.వెంకటప్పయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్న గ్రామోత్సవం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ టి.వెంకటప్పయ్య మాట్లాడుతూ.. యువత మద్యం, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇలాంటి పోటీలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని అన్నారు.

పురుషుల వాలీబాల్ విభాగంలో ఆసుపాక జట్టు ప్రథమ స్థానం సాధించగా, కొయ్యూరు జట్టు ద్వితీయ, కేఎన్‌పురం జట్టు తృతీయ, కాశీనగరం జట్టు చతుర్థ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు సీఐ టి. వెంకటప్పయ్య బహుమతులు అందజేశారు. గ్రామస్థులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విశేష సహకారం అందించాయి. ముఖ్యంగా ఐటీడీఏ పీఓ బి. రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (ఐపీఎస్), సీఐ టి. వెంకటప్పయ్య అందించిన సహకారానికి ఈశా గ్రామోత్సవం బృందం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే పోటీల నిర్వహణలో సహకరించిన పీడీలు, పీఈటీల సేవలను అభినందించింది. 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం గ్రామీణ భారతదేశంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని ఆదియోగి సన్నిధిలో జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేత జట్లకు మొత్తం రూ.1 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నారు. వాలీబాల్ (పురుషులు), త్రోబాల్ (మహిళలు) విభాగాల్లో విజేతలకు తలా రూ.5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు.

Next Story