జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

by Ratna Kumari |

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
X

దిశ, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రీకర ప్రసాద్ (62), ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుడు వీర వెంకట ప్రసాద్ కలిసి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఏపీ 09 సీఆర్ 0010 నంబర్ గల కారులో వస్తుండగా, పెద్దకాపర్తి సమీపంలోని యూ-టర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన అర్షియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా కారును ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వీర వెంకట ప్రసాద్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనాస్థలాన్ని నార్కట్‌పల్లి సీఐ సురేష్ పరిశీలించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ..

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమికంగా అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు.

Next Story