- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరువును దూరం చేసే మెట్ల బావులు..
మీరు మెట్ల బావులను ఎప్పుడైనా చూశారా? వావ్, బావులి, బావరి, బాయి అని.. ప్రాంతానికి తగినట్లుగా పిలుచుకుంటారు. పురాతన కాలపు అద్భుతమైన జలసంరక్షణ వ్యవస్థకు ప్రతీకలుగా పిలువబడే ఇవి.. వందల సంవత్సరాల క్రితమే నీటి కొరత, కరువు, అధిక వేడి సమస్యలను పరిష్కరించాయి.

దిశ, ఫీచర్స్ : మీరు మెట్ల బావులను ఎప్పుడైనా చూశారా? వావ్, బావులి, బావరి, బాయి అని.. ప్రాంతానికి తగినట్లుగా పిలుచుకుంటారు. పురాతన కాలపు అద్భుతమైన జలసంరక్షణ వ్యవస్థకు ప్రతీకలుగా పిలువబడే ఇవి.. వందల సంవత్సరాల క్రితమే నీటి కొరత, కరువు, అధిక వేడి సమస్యలను పరిష్కరించాయి.
నీటి సంరక్షణ :
గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్య భారతదేశంలో వర్షాలు కేవలం వర్షా కాలంలోనే పడతాయి. కాబట్టి ఆ నీటిని సంరక్షించేందుకు.. ఏడాదంతా కరువు లేకుండా ఉండేందుకు వీటిని వాడే వారు. భూగర్భంలో లోతుగా తవ్విన బావుల్లో నీటిని తీసుకునేందుకు మెట్లను రూపొందించారు. వర్షపు నీటిని సేకరించి, ఎండాకాలంలో కూడా నీరు అందుబాటులో ఉండేలా రూపొందించబడటమే కాదు తద్వారా భూగర్భ జలాలను కూడా పునరుద్ధరించారు. బావుల్లోకి దిగితే ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. మందమైన రాళ్ల గోడలు, నీడ, భూగర్భ నిర్మాణం, నీటి ఆవిరి వల్ల సహజంగానే చల్లదనం ఏర్పడుతుంది. విద్యుత్ లేని కాలంలో ఇవి చల్లని విశ్రాంతి స్థలాలుగా కూడా ఉపయోగపడేవి.
సాంస్కృతిక పాత్ర:
నీరు తీసుకోవడానికి వచ్చే స్త్రీలు, ప్రయాణీకులు, వ్యాపారులు ఇక్కడ సమావేశమయ్యేవారు. ఇవి కేవలం బావులు కాకుండా సమాజ కేంద్రాలుగా, మతపరమైన కార్యక్రమాలకు కూడా ఉపయోగపడేవి. చాలా బావులు అందమైన శిల్పాలు, స్తంభాలతో అలంకరించబడి.. అనేక సంప్రదాయ కార్యక్రమాలకు వేదికగా మారేవి. కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండేవి. ఇందుకు మంచి ఉదాహరణ గుజరాత్‌లోని రాణి-కి-వావ్. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్ల బావి.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కాగా హైదరాబాద్ బన్సీలాల్ పేటలోని 300 ఏళ్ల నాటి.. ఆరు అంతస్తుల లోతు ఉన్న.. మెట్లబావి ప్రస్తుతం బావితరాలకు మన సంప్రదాయాలను వివరిస్తోంది. పూర్తిగా కూరుకుపోయిన ఈ మెట్ల బావిలో 500 టన్నుల మట్టి, చెత్తను తొలగించి.. మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఎందుకు ఇప్పుడు..?
భారతదేశంలో వేడి తరంగాలు, భూగర్భ జలాల క్షీణత, వర్షాల అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పురాతన వ్యవస్థలు స్ఫూర్తి ఇస్తున్నాయి. వీటిని పునరుద్ధరించడం ద్వారా స్థానికంగా నీటిని సేకరించడం, భూగర్భ జలాలను నింపడం సాధ్యమవుతుంది. ప్రకృతితో మమేకమైన జ్ఞానం ఇప్పటికీ మనకు ఉపయోగపడుతుందనేది నిపుణుల సలహా.






