- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయమంటే ఏంటో చూపిస్తాం.. ఒవైసీ సోదరులకు బండి సంజయ్ వార్నింగ్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రాజకీయ అండతోనే ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చివరికి న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా, హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అడ్డగోలుగా తప్పులు చేస్తూ మళ్లీ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలకు కోర్టులు అన్నా, చట్టాలు అన్నా అస్సలు గౌరవం లేదని ధ్వజమెత్తారు. చెరువులను ఆక్రమించుకుని విద్యాసంస్థలను నిర్మించడమే ఒక పెద్ద తప్పని, దీనిపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఒవైసీ ఎందుకు జాప్యం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఫాతిమా విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరెదపడం లేదని ఆయన నిలదీశారు.
బీజేపీ వస్తే కూల్చివేతలు ఖాయం..
గండిపేట ఎఫ్టీఎల్ (Full Tank Level) పరిధిలో ఉన్న విద్యా సంస్థలకు కూల్చివేస్తామంటూ నోటీసుల మీద నోటీసులు ఇస్తున్న ప్రభుత్వం.. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు ఇంకో న్యాయమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒవైసీ నేతృత్వంలోని సదరు విద్యా సంస్థ గతంలో మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? అని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ విద్యార్థులకు చదువు చెప్పే ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేపు బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమంగా కట్టిన ఫాతిమా విద్యా సంస్థలను కూల్చివేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తామన్నారు. అయితే, ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న అమాయక విద్యార్థుల భవిష్యత్తు చెడిపోకుండా, వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ విద్యావకాశాలను చూపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.






