- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: పంప్-అండ్-డంప్ స్కామ్‌పై సెబీ భారీ చర్య
ఈ వ్యవహారంలో పాల్గొన్న వారికి నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు మార్కెట్ నిషేధం విధించడంతో పాటు మొత్తం రూ. 47.7 కోట్ల జరిమానా విధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఐదు లిస్టెడ్ కంపెనీల్లో జరిగిన భారీ 'పంప్-అండ్-డంప్' షేర్ మార్కెట్ మోసాన్ని వెలికితీస్తూ 222 మంది వ్యక్తులు, ఐదు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. మౌరియా ఉద్యోగ్, విశాల్ ఫ్యాబ్రిక్స్, 7ఎన్ఆర్ రిటైల్, జీబీఎల్ ఇండస్ట్రీస్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీల షేర్లలో కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్, ధరలను పెంచి సాధారణ పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు సెబీ తేల్చింది. ఈ వ్యవహారంలో పాల్గొన్న వారికి నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు మార్కెట్ నిషేధం విధించడంతో పాటు మొత్తం రూ. 47.7 కోట్ల జరిమానా విధించింది. అక్రమంగా పొందిన లాభాలను తిరిగి చెల్లించాలని కూడా ఆదేశించింది. ఇప్పటికే 2023 జూన్‌లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సెబీ, ఇప్పుడు 394 పేజీల తుది ఉత్తర్వులో హనీఫ్ షేక్‌ను ఈ పథకానికి ప్రధాన సూత్రధారిగా గుర్తించి, అతనికి ఏడు సంవత్సరాల నిషేధంతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది.
సెబీ దర్యాప్తు ప్రకారం, ఈ కంపెనీల్లో వ్యాపార పనితీరు లేదా కీలక కార్పొరేట్ పరిణామాలు లేకపోయినా 2017–2020 మధ్య షేర్ ధరలు, ట్రేడింగ్ అసాధారణంగా పెరిగాయి. ఇందుకోసం అనుబంధ సంస్థలు తమలో తాము ట్రేడింగ్ చేసి కృత్రిమ వాల్యూమ్ సృష్టించగా, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను పోలిన హెడర్‌లతో బల్క్ ఎస్ఎమ్మెస్‌లు పంపి, కొన్ని వెబ్‌సైట్ల ద్వారా ‘కొనుగోలు’ సిఫార్సులు ప్రచారం చేసి పెట్టుబడిదారులను ఆకర్షించారు. ధరలు పెరిగిన తర్వాత ముందుగానే షేర్లు కొనుగోలు చేసిన ఆపరేటర్లు వాటిని అధిక ధరలకు విక్రయించి భారీ లాభాలు పొందారు. మౌరియా ఉద్యోగ్‌లో ప్రమోటర్లు, అనుబంధ సంస్థలే ఈ లాభాల తుది లబ్ధిదారులని, కంపెనీకి చెందిన 62 మంది ఉద్యోగులు కూడా ఈ పథకంలో భాగమై తమ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ప్రమోటర్లకు బదిలీ చేసినట్లు సెబీ వెల్లడించింది. ఆర్‌బీఐలో నమోదైన ఎన్‌బీఎఫ్‌సీ గోయెంకా బిజినెస్ ఫైనాన్స్ ధరల తారుమారులో కీలక పాత్ర పోషించిందని, డార్జిలింగ్ రోప్‌వేలో ప్రమోటర్ హిమాన్షు షా అధిక ధరకు తన వాటా విక్రయించేందుకు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని కూడా సెబీ పేర్కొంది.






