EVs: ఈవీలతో రూ. లక్ష కోట్ల ఆదా

by S Gopi |

దీంతో ముడిచమురు దిగుమతులపై దాదాపు రూ. లక్ష కోట్ల వరకు విదేశీ మారక వ్యయం ఆదా కావచ్చని తెలిపింది.

EVs: ఈవీలతో రూ. లక్ష కోట్ల ఆదా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం ప్రస్తుతం ఉన్న వేగంతో పెరిగితే, దేశ ఆర్థికవ్యవస్థకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2030 నాటికి మొత్తం వాహన మార్కెట్‌లో ఈవీల వాటా 20 శాతానికి(అంటే ప్రతి 5 వాహనాల్లో ఒకటి) చేరుకుంటాయని, 2027 నుంచి 2030 మధ్య మరో 35 లక్షల పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయని అంచనా వేసింది. దీంతో ముడిచమురు దిగుమతులపై దాదాపు రూ. లక్ష కోట్ల వరకు విదేశీ మారక వ్యయం ఆదా కావచ్చని తెలిపింది. 2026 నాటికి ఈవీల మార్కెట్ వాటా ఇప్పటికే 8 శాతానికి చేరిందని, 2026, ఫిబ్రవరిలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఇంధన ధరలపై ఆందోళన పెరగడంతో వినియోగదారులు మరింతగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపారని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. 2025లో నెలకు సగటున 1.3 లక్షలుగా ఉన్న ఈవీ రిజిస్ట్రేషన్లు, 2026 మార్చి–జూన్ మధ్య 2.3 లక్షలకు చేరగా, ఈ ఏడాది మొత్తం రిజిస్ట్రేషన్లు 25 లక్షలు దాటే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే ఈవీల విస్తరణకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలే ప్రధాన సవాలుగా ఉందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, వాటిలో ఫాస్ట్ ఛార్జర్లు కేవలం 30 శాతం మాత్రమే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలు కలిసి దేశ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో 35 శాతం వాటా కలిగి ఉండగా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముందున్నాయి. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 32 వేల కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవీల దీర్ఘకాల వృద్ధికి 10–15 ఏళ్ల స్పష్టమైన రోడ్‌మ్యాప్, బ్యాటరీ తయారీ ప్రోత్సాహం, ఈవీ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు రాయితీలో స్థలాలు, ప్రభుత్వ కొనుగోళ్ల పెంపు వంటి చర్యలు కీలకమని ఎస్‌బీఐ సూచించింది.

Next Story