- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది.

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తొమ్మిది మండలాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఆ నియామకాలను వ్యతిరేకిస్తూ ఆదివారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అర్వపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, బ్లాక్ నాయకులు, గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచులను సంప్రదించకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చి, సభ్యత్వం కూడా లేని వారికి మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టడం సరైందికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఈ నియామకాలను రద్దు చేయాలని, లేకుంటే గాంధీభవన్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అర్వపల్లి వై జంక్షన్‌లో ప్లకార్డులతో మెరుపు ధర్నా నిర్వహించారు. సుమారు గంటపాటు కొనసాగిన ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆందోళనకారులను శాంతింపజేశారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, మడ్డి పద్మ, రత్నం సంతోష్, మోరపాక సత్యం, తొడుసు లింగయ్య, దొంగరి గోవర్ధన్, వంగాల సత్యనారాయణ, పాలకుర్తి రాజయ్య, నారగోని అంజయ్య, నర్సింగ శ్రీనివాస్, రామోజీ, ఉప్పుల రాంబాబు, సర్పంచులు, గ్రామ శాఖల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






