- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను అంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర..
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను, తన కుటుంబాన్ని అంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు.

దిశ,కాగజ్‌నగర్ : ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను, తన కుటుంబాన్ని అంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం స్వేరోస్ ఆధ్వర్యంలో, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన విద్యార్థినుల స్కాలర్‌షిప్స్ పంపిణీ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణను పాలిస్తున్న రేవంత్ రెడ్డి ఒక తోలుబొమ్మ అని, ఆ బొమ్మను వెనుక ఉండి ఆడిస్తోంది ఏపీ సీఎం చంద్రబాబేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును నింపడానికి, చంద్రబాబు, బీజేపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటానికే తెలంగాణలో కన్నెపల్లి పంప్ హౌస్‌ను బంద్ చేశారని మండిపడ్డారు. వానలు లేక ఎల్నినో ప్రమాదం పొంచి ఉన్నా కాళేశ్వరం నీళ్లను ఆంధ్రకు తరలిస్తుంటే సీఎం చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. కన్నెపల్లి పరిశీలనకు వెళ్లిన కేటీఆర్‌ను అడ్డుకోవడం దుర్మార్గమని ఏ చర్చకు, సవాల్‌కు రాకుండా పారిపోతున్న రేవంత్ రెడ్డికి చరిత్రలో హిట్లర్, ముస్సోలినీ లాంటి నియంతలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
పేద విద్యార్థినులకు ఆర్ఎస్పీ భరోసా..
రాజకీయ విమర్శల అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 120 మంది పేద డిగ్రీ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఎంపికైన వారికి ఏటా రూ. 30 వేల చొప్పున మూడేళ్ల పాటు మొత్తం రూ. 90 వేలు ఈ ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. అమ్మాయిలు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోకుండా, బాగా చదువుకుని ఆర్థికంగా స్థిరపడాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ ప్రాంత పేద బిడ్డల చదువుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా నాయకుడు డోంగ్రి సురేష్, కో-ఆర్డినేటర్ మమత, విద్యార్థుల తల్లిదండ్రులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






