- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం : తలసాని శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా సీఎం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. చర్చలకు సవాల్ చేసి హరీశ్‌రావును అక్రమంగా అరెస్ట్ చేశారని తలసాని ఆరోపించారు.

- రెండున్నరేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
- కాంగ్రెస్ 4 లక్షల కోట్లతో అప్పుతో ఏం చేసిందో చెప్పాలి
- ఎస్ఐఆర్‌లో బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
- మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా సీఎం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. చర్చలకు సవాల్ చేసి హరీశ్‌రావును అక్రమంగా అరెస్ట్ చేశారని.. రెండున్నరేళ్ల తర్వాత తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి తలసాని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. పదేళ్లలో రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే రేవంత్‌రెడ్డి సీఎం అనే విషయాన్ని మరిచి బూతు భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తలవకుంటే రేవంత్‌రెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అలాగే.. ఎస్ఐఆర్‌లో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. కొన్ని వర్గాల ఓట్లు తొలగింపే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిమానం, ఆదరణ పొందిన వారికే కార్పొరేషన్ ఎన్నికలలో అవకాశం లభిస్తుందని.. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం పోరాడాలని సూచించారు.






