- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడ బైపాస్‌పై భయానక ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని తృటిలో తప్పించింది.

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని తృటిలో తప్పించింది. విజయవాడ నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ముందు టైరు ఊడిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అనంతరం కారు రోడ్డుకు ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న ఐదుగురిని బయటకు తీసుకొచ్చారు. వారు బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే కారులోని సీఏన్‌జీ వ్యవస్థ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన నాని, వెంకట చిన్నికృష్ణ, వెంకటకృష్ణ, రోహిణి, శ్రీనివాస్ ఆదివారం ఉదయం యాదగిరిగుట్టకు బయలుదేరారు. కోదాడ మండలం శ్రీరంగాపురం సమీపంలోని జాతీయ రహదారి-65పై ప్రయాణిస్తుండగా కారు ముందు టైరు ఊడిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డుపక్కనే ఉన్న పంట పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా, ఆయనను మొదట కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు చూపిన ధైర్యసాహసాలు, అప్రమత్తత వల్లే ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే మరింత ఘోర ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై కోదాడ పట్టణ పోలీసులను వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని వారు తెలిపారు.






