కలెక్షన్లలో దూసుకుపోతున్న హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'

by Muthe.Rajitha |   (  Updated:2026-05-31 06:41:58  IST  )

హాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ (Obsession) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

కలెక్షన్లలో దూసుకుపోతున్న హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్ అబ్సెషన్
X

దిశ, వెబ్ డెస్క్ : హాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఇండీ హార్రర్ మూవీ, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన కర్రీ బార్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె ప్రధాన పాత్రల్లో నటించారు. మే 15న అమెరికాలో విడుదలైన ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం అమెరికా, కెనడాలో 86 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.730 కోట్లకు పైగా) వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 108 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.900-950 కోట్లు) కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఈ చిత్రం త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది.

బడ్జెట్‌తో పోలిస్తే 100 రెట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా 'అబ్సెషన్' 2026లో అత్యంత లాభదాయక సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భారత్‌లో ఈ చిత్రం మే 29న విడుదలైంది. తొలి రోజే ప్రివ్యూలతో కలిపి రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో షోల సంఖ్య కూడా పెరుగుతోంది. కథ విషయానికి వస్తే.. తన క్రష్ తనను ప్రేమించాలని కోరుకున్న ఓ యువకుడు చేసే 'విష్' అనూహ్యమైన, భయానక పరిణామాలకు దారితీస్తుంది. ప్రేమ, భయం కలగలిసిన ఈ సైకలాజికల్ హార్రర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

ఆ విషయంలో చాలా భయపడ్డా.. అందుకే ‘గవర్నర్’ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకున్నా: మనోజ్ బాజ్‌పాయ్

Next Story