మండుతున్న చితుల మధ్య హోలీ.. వారణాసి హరిశ్చంద్ర ఘాట్‌లో వేల మంది భక్తుల భస్మ స్నానం!

by Malleboina Mahesh |

మరణాన్ని ఉత్సవంలా జరుపుకునే కాశీ సంప్రదాయం! మండుతున్న చితుల మధ్య, చితి భస్మంతో శివ భక్తుల 'మసానే కీ హోలీ'. రంగభరి ఏకాదశి వేళ వారణాసి ఘాట్‌లలో ఆధ్యాత్మిక రంగుల కేళి.

మండుతున్న చితుల మధ్య హోలీ.. వారణాసి హరిశ్చంద్ర ఘాట్‌లో వేల మంది భక్తుల భస్మ స్నానం!
X

దిశ, వెబ్ డెస్క్: హోలీ పండుగ (Holi festival)కు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రంగుల పండుగను చేసుకుంటారు. ప్రజాదరణ పొందిన కథ ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యపుడి మరణం తర్వాత నుంచి ప్రజలు ఈ హోలీ పండుగను చేస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుని కలుసుకునే పండుగ ఇది. పాత గొడవలను మర్చిపోయి, శత్రువులను సైతం హత్తుకుని స్నేహపూర్వకంగా ఉండాలని ఈ పండుగ సందేశాన్నిస్తుంది. కానీ దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రాంతం అయిన వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు.

వారణాసి (Varanasi)లో హోలీ పండుగ సాధారణ రంగులతో కాకుండా, స్మశానవాటికలో మండుతున్న చితుల మధ్య చితా భస్మం తో ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా 'రంగభరి ఏకాదశి' మరుసటిరోజు శివ భక్తులు, అఘోరాలు, నాగా సాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్‌ (Harishchandra Ghat)కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను (చితా భస్మం) ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ జరుపుకుంటారు. డమరుక నాదాలు, "హర హర మహాదేవ్" నినాదాల మధ్య గంటల తరబడి సాగే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు. సాధారణంగా స్మశానం అంటే భయం, నిశ్శబ్దం ఉంటుంది, కానీ కాశీలో మాత్రం మరణాన్ని కూడా ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత.

ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏమిటి?

పురాణాల ప్రకారం.. రంగభరి ఏకాదశి (Rangabhari Ekadashi) రోజున శివుడు పార్వతీ దేవితో కలిసి కాశీకి వస్తాడు. ఆ రోజున దేవతలు, మానవులతో కలిసి శివుడు రంగుల హోలీ ఆడతాడు. అయితే, శివుని వెంట ఉండే భూత ప్రేత పిశాచాలు, గణాలకు ఆ రోజున అందరితో కలిసి రంగులాడే అవకాశం లభించదు. అందుకే మరుసటి రోజున తన ప్రియమైన గణాల కోసం శివుడు స్వయంగా స్మశానవాటికకు వచ్చి చితి భస్మంతో హోలీ ఆడతారని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంటే.. మరణం అనేది జీవితంలో అంతిమ సత్యమని, దానికి భయపడాల్సిన అవసరం లేదని చాటి చెప్పడమే. భౌతిక బంధాల నుంచి విముక్తిని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ఈ 'మసానే కీ హోలీ' ('Masane ki Holi') సూచిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. అందుకు వారణాసిలో కాలుతున్న చితుల మధ్యనే ఈ వేడుకను కోలాహలంగా చేసుకుంటారు.

Next Story