మానవత్వం మిగిలే ఉంది.. ముస్లింలపై మూకదాడిని అడ్డుకున్న హిందూ యువకుడు

by Muthe.Rajitha |

ముస్లిమ్ వృద్ధుడిపై జరుగుతున్న మూకదాడిని ఓ హిందూ యువకుడు దైర్యంగా ఎదుర్కొన్నాడు.

మానవత్వం మిగిలే ఉంది.. ముస్లింలపై మూకదాడిని అడ్డుకున్న హిందూ యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ముస్లిమ్ వృద్ధుడిపై జరుగుతున్న మూకదాడిని ఓ హిందూ యువకుడు దైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా యువకుని పేరు దేశం అంతా మారుమ్రోగిపోతోంది. ఉత్తరాఖండ్‌లోని కొత్ద్వార్ పట్టణంలో జరిగిన ఈ ఘటన.. మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. వకీల్ అహమ్మద్ అనే 70 ఏళ్ల ముసలాయన చిన్నగా స్కూల్ యూనిఫాం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి “బాబా స్కూల్ డ్రెస్” అనే పేరు ఉంది. ఈ పేరు పెట్టుకుని ఆయన గత 30 ఏళ్లకు పైగా ఎలాంటి సమస్య లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒక రోజు కొంతమంది వ్యక్తులు దుకాణానికి వచ్చి, "బాబా" అనే పదం హిందువులది, నువ్వు ముస్లింవి కాబట్టి ఈ పేరు పెట్టుకోవడానికి హక్కు లేదని బెదిరించారు. బోర్డు తీసేయాలని, అసలు ఇక్కడ దుకాణం పెట్టుకోవద్దని అరవడం మొదలుపెట్టారు.

వృద్ధుడైన వకీల్ అహమ్మద్ తన జీవనాధారం ఇదేనని, దయచేసి తన ఉపాధిని నాశనం చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ గొడవ జరుగుతున్నపుడు చుట్టుపక్కల జనం చూస్తూ ఉన్నారు తప్ప ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది తమ మీదకి వస్తుందని చూసి చూడనట్టు తప్పుకుపోయారు. ఇంతలో అక్కడే జిమ్ నిర్వహిస్తున్న దీపక్ అనే ఒక యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గుంపులోకి వెళ్లి శాంతిగా మాట్లాడి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన ఆ గుంపు.. "నువ్వెవరు? నీ పేరేమిటి? ఎందుకు ముస్లిం వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నావు?" అంటూ దీపక్‌పై అరవడం మొదలుపెట్టింది. "నా పేరు దీపక్" అని అతడు చెప్పగానే, హిందువై ఉండి ముస్లింకి మద్దతు ఇస్తావా అంటూ తిట్టారు. అక్కడినుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.

అప్పుడు దీపక్ చాలా ధైర్యంగా.. "నా పేరు మహమ్మద్ దీపక్.. అయితే ఇప్పుడు ఏమిటి మీ సమస్య? ఏదైనా ఉంటె నాతో గొడవ పడండి" అంటూ గట్టిగ మాట్లాడటంతో.. ఆ మూక వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. అయితే వెళ్ళినవారు వెళ్ళినట్టే.. మరింతమందిని తీసుకువచ్చి దీపక్ నడుపుతున్న జిమ్ సెంటర్ ను చుట్టుముట్టి ద్రోహి అంటూ అరవడం మొదలు పెట్టారు. వెంటనే క్షమాపణ కోరాలని లేదంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వారికి ఏ మాత్రం భయపడని దీపక్.." చనిపోయాక దేవుడు నువ్వు ఏ మతానికి చెందినవాడివని అడగడు, నువ్వు ఎంత మానవత్వంతో బతికావు అనేదే ఆ పైవాడు చూస్తాడు" అని చెబుతూ.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీపక్ కు మద్దతుగా జిమ్ లోని వారితోపాటు వందలాదిమంది మద్దతుగా నిలబడ్డారు. చివరికి పోలీసుల జోక్యం చేసుకొని ఆ గుంపుపై కేసులు నమోదు చేసారు. సమయానికి దీపక్ చూపించిన తెగువకు కొత్వార పట్టణమే కాకుండా.. దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో దీపక్ హీరో అయిపోయాడు. దీపక్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. విద్వేషం నిండిన మూక మధ్యలో నిలబడి మానవత్వాన్ని కాపాడిన వీరుడిగా దీపక్ ఆదర్శంగా నిలిచాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Next Story