అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

by Malleboina Mahesh |   (  Updated:2026-05-06 06:46:04  IST  )

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత హిమంత బిశ్వ శర్మ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించి, వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నం గౌహతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Governor Laxman Prasad Acharya)ను కలిసిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని (Resignation letter) సమర్పించారు.

ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన చర్య. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి (Acting Chief Minister)గా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు. 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ కూటమి 102 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయడంతో, హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, అనంతరం ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సీఎం అభ్యర్థిని పార్టీనే నిర్ణయిస్తుంది

రాజీనామాను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిమంత బిస్వా శర్మ ఇలా అన్నారు.. "మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జేపీ నడ్డా, నయాబ్ సింగ్ సైని ఇద్దరినీ పరిశీలకులుగా నియమించారు. ముఖ్యమంత్రి ఎవరు, తదుపరి నాయకుడు ఎవరు అనేది శాసనసభ పక్షం నిర్ణయిస్తుంది. శాసనసభ పక్షం సమావేశం అనంతరం, బీజేపీ, ఎన్డీఏ తిరిగి లోక్‌భవన్‌కు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ వాదనను వినిపిస్తాయి. కానీ శాసనసభ పక్ష నాయకుడిని ఇంకా ఎన్నుకోలేదు, కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మనం వేచి ఉండాలి."

Next Story