- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ - కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ - కర్ణాటక సరిహద్దు గ్రామం మల్గి సమీపంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ - కర్ణాటక సరిహద్దు గ్రామం మల్గి సమీపంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్గి గ్రామ పరిసర ప్రాంతంలో కర్ణాటక అధికారులు అడ్డగోలుగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడమే కాకుండా.. అక్కడ వ్యర్థాలను పారబోయడం ఈ వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన టన్నుల కొద్దీ చెత్తను, మురికిని తీసుకొచ్చి తమ గ్రామ సమీపంలో బార్డర్ వద్ద కుమ్మరిస్తుండటంతో మల్గి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం పెరిగిపోయి రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కర్ణాటక మున్సిపల్ వాహనాలను, అధికారులను అడ్డుకున్నారు. తమ సరిహద్దుల్లో చెత్త వేయడానికి వీల్లేదంటూ అక్కడ భారీ ఆందోళనకు దిగారు.
గ్రామస్తులు తమను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీదర్ మున్సిపాలిటీ అధికారులు మరియు సిబ్బంది అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. నిరసన తెలుపుతున్న ప్రజలపై కక్షపూరితంగా, తాము తెచ్చిన చెత్త మొత్తాన్ని మల్గి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపైనే మున్సిపల్ వాహనాల నుంచి పారబోయించారు. రోడ్డుకు అడ్డంగా చెత్త కుప్పలను వేయడంతో స్థానికంగా తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రెండు వైపుల అధికారులు, ప్రజల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ చెత్త కుప్పల కారణంగా బీదర్ - మల్గి ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీనివల్ల తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర రవాణా వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సరిహద్దు ఘర్షణపై సమాచారం అందుకున్న వెంటనే ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ బలగాలు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతరాష్ట్ర రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై వేసిన చెత్తను వెంటనే తొలగించాలని, సరిహద్దు గ్రామ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేలా డంపింగ్ యార్డును ఇక్కడ ఏర్పాటు చేయడం సరికాదని తెలంగాణ వైపు అధికారులు, స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో ఈ సమస్యను చర్చించి శాశ్వత పరిష్కారం చూపే వరకు తాము ఆందోళన విరమించేది లేదని మల్గి గ్రామస్థులు తెగేసి చెబుతుండటంతో సరిహద్దు వద్ద ఇంకా ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగుతోంది.






