ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

by Ratna Kumari |   (  Updated:2026-07-20 14:30:44  IST  )

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, నల్లగొండ క్రైం: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్‌లో "ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సంసిద్ధత – ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం" అంశంపై నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, ఇప్పటికే సాగులో ఉన్న పంటలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జలాలు, వ్యవసాయం, ఉద్యానవనం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, సాగునీటి కోసం కొత్త బోర్లు వేయడాన్ని నియంత్రించి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

వరి సాగు చేయకుండా రైతులను చైతన్యపరచాలి..

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, దేశంలో ఈసారి "సూపర్ ఎల్‌నినో" పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. బోర్లు వేసినా చివరి వరకు నీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తే అవకాశముందని, అందువల్ల తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతుందని, వర్షాలు లేకపోతే వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశముందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు లింకేజీ ఏర్పాటు చేస్తామని, ఎస్‌ఎల్‌బీసీ, డిండి తదితర ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల ఫేజ్-6 ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను అందిస్తామని వెల్లడించారు. అనంతరం కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శిస్తూ ప్రస్తుత నీటి పరిస్థితులను ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Next Story