ఆర్మూరులో టెన్షన్ టెన్షన్.. రణరంగాన్ని తలపించిన బీజేపీ ర్యాలీ

by Batti.Sumithra |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో హిందూ సంఘాలు, బీజేపీ సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది.

ఆర్మూరులో టెన్షన్ టెన్షన్.. రణరంగాన్ని తలపించిన బీజేపీ ర్యాలీ
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో హిందూ సంఘాలు, బీజేపీ సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. ఇటీవల కొటార్మూర్‌లోని భరత్ చంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించడం, నమాజ్ నేర్పిస్తున్నారనే ఆరోపణలపై బీజేపీ, హిందూ సంఘాలు ఈ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు వస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డికి తరలించారు. అనంతరం ఆయనను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన నిరసన ర్యాలీ ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభమైంది. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధించడం, నమాజ్ నేర్పిస్తున్నారనే ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఇటీవల పిప్రి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కూడా ఆయన పోలీసుల తీరును విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహభరితంగా ఉండగా, అవి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ యథాతథంగా పొందుపరచడం లేదు.

పోలీసులు ర్యాలీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆర్మూర్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అలాగే భరత్ చంద్ర పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడించి ఎంఈఓ పింజ రాజగంగారంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, కలిగోట్ గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, యాళ్ల రాజ్‌కుమార్, కేసీ ముత్తన్న, పిప్రి రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అరెస్ట్

కొటార్మూర్‌లోని భరత్ చంద్ర పాఠశాల ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్‌పై దాడి చేశారనే ఆరోపణలతో మైనారిటీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలును అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో ఉన్న మందుల బాలును ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ నేతృత్వంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్తున్నారని మందుల బాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తరలించారు.

Next Story