- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ లక్ష్యాలకు ఉన్నతాధికారుల తూట్లు..! అంగన్‌వాడీల్లో అటకెక్కిన నియామకాలు
మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాలు, పథకాల అమలు, బోర్డులు, కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతుండగా.. ఆఫీసర్ల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
15 వేల కొలువులకు ‘గ్రహణం’
రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో 15 వేల టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్ వాడీల్లో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్లు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జీఏడీ సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశమున్నా.. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండి, ఉన్నత సిబ్బందిపై పనిభారం పడుతున్నది. 15 వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే వచ్చే గుర్తింపునూ ప్రభుత్వానికి రాకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రూ.35 కోట్ల నిధులు వదులుకున్నట్టేనా?
అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు వండే వంట పాత్రలు పదేళ్ల క్రితం నాటివి కావడంతో.. వంట పాత్రలు శుభ్రంగా ఉండేలా, పిల్లలకు అనారోగ్య సమస్యలు దరి చేరకుండా.. పాతవాటి స్థానంలో కొత్త వాటిని కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,781 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా.. దానికి అనుగుణంగా ఒక్కో కేంద్రానికి రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు దాదాపు రూ. 35 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. దీని కోసం అంచనాలు పంపాలని ఆరు నెలల క్రితమే లేఖ రాసింది. దీనికి రాష్ట్ర అధికారులు స్పందించలేదు. రాష్ట్రంపై ఒక్క రూపాయి భారం పడకుండా పిల్లలకు పరిశుభ్రమైన పాత్రల్లో వంట అందే అవకాశమున్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది.
బోర్డులు, కమిషన్లకూ దిక్కులేదు
మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ), డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీల కాలం 2024 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడటం, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో వీటి నియామకం ఆలస్యమైంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీల్లో ఒక చైర్ పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ, మరొకరు పిల్లల సమస్యల నిపుణులై ఉంటారు. జేజేబీలోనూ ఇద్దరు సామాజిక కార్యకర్తలు, అందులో ఒకరు మహిళ ఉంటారు. వీటి నియామకానికి సంబంధించి 2025 జులై 22న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 35 ఏళ్లు పైబడిన వారికి, 65 ఏండ్లలోపు వారు ఈ పదవులకు అర్హులు. ఈ క్రమంలోనే మరికొందరికీ అర్హత కల్పిస్తూ సెప్టెంబర్ 4న మరోసారి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇంటర్వ్యూల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం ఈ కమిటీలు ఉండగా.. ప్రస్తుత నోటిఫికేషన్‌లో మాత్రం 36 ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు జనాభా పరంగా పెద్దవి కావడంతో.. వీటిలో రెండు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 33 జిల్లాలకు 36ను ఏర్పాటు చేయనున్నారు. వీటి నియామకాల్లో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
మహిళా కమిషన్‌కు దరఖాస్తులేవి?
నేరెళ్ల శారద చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ గడువు ఈనెల 7వ తేదీతో ముగిసింది. కొత్త చైర్మన్, సభ్యులను నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం సభ్యులను ఎంపిక చేస్తారు. కమిషన్ గడువు ముగిసి 3 వారాలు గడుస్తున్నా ఇంతవరకు నోటిఫికేషన్ ఊసే లేదు. వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తే మరికొన్ని నెలలు సమయం పట్టనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారుల నుంచి కదలిక లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక ప్రభుత్వ స్థాయిలో జరగనుంది. కానీ, దరఖాస్తులు ఆహ్వానించడానికి ఎందుకు ఆలస్యమవుతున్నదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
క్షేత్ర స్థాయి సమస్యలపైనా చిన్నచూపు..
అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ప్యాకెట్ల విషయంలోనూ అధికారుల తీరు విడ్డూరంగా ఉంది. పిల్లలకు ఇచ్చేందుకు సులభంగా ఉండేలా 200 మిల్లీ లీటర్ల ప్యాకెట్లు ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్లు కోరుతున్నారు. దీనిపై ఆదేశాలు వెలువడినా.. ఇప్పటికీ లీటర్ ప్యాకెట్లనే సరఫరా చేస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అల్పాహారం (ఉప్మా) పథకం అమలులోనూ వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ప్రభుత్వం ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. అమలు చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో ఆచరణలో వేగం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






