ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

by Ratna Kumari |   (  Updated:2026-07-03 13:11:26  IST  )

ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయకమైన పంట అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం
X

దిశ, తాడ్వాయి : ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయకమైన పంట అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఆయన పర్యటించి ప్రగతిశీల రైతు కాటిపల్లి రామ్‌మోహన్ రెడ్డి ఎనిమిది ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడిన కలెక్టర్ మొక్కల ఎదుగుదల, సాగు పద్ధతులు, సాంకేతిక సలహాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో 2022–23లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఆయిల్ పామ్ సాగు ప్రస్తుతం 885 మంది రైతులు 2,533 ఎకరాల్లో విజయవంతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,300 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికే వెయ్యి ఎకరాలకు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 48 మంది రైతులకు చెందిన 180 ఎకరాల్లో ఆయిల్ పామ్ కోత పూర్తై 76 మెట్రిక్ టన్నుల తాజా పండ్ల గుత్తుల దిగుబడి లభించిందని, దీని ద్వారా రైతులు మొత్తం రూ.18,07,508 ఆదాయం పొందారని వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా మరో 19 మంది రైతులు 53.83 ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు.

ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలి..

ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఎకరానికి అవసరమైన మొక్కలపై ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోందని, రైతులు ఒక్కో మొక్కకు రూ.20 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తోటల నిర్వహణ కోసం నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఎకరానికి ఏటా రూ.4,200 చొప్పున సబ్సిడీ అందిస్తుండగా, డ్రిప్ ఇరిగేషన్ కోసం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రతి ఎకరానికి అదనంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు.

సాంప్రదాయ పంటలతో పోలిస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో దీర్ఘకాలికంగా అధిక లాభాలు పొందే అవకాశమున్నందున మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ దృష్టికి రెవెన్యూ సమస్యలు..

పర్యటన సందర్భంగా దేమికలాన్ పరిసర గ్రామాల రైతులు తమ రెవెన్యూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వంశపారంపర్య భూముల రిజిస్ట్రేషన్లను గిఫ్ట్ డీడ్‌గా మార్చాలని చేసిన దరఖాస్తులను తహశీల్దార్ తిరస్కరించారని, అదే సర్వే నంబర్లలో ఇతరులకు మాత్రం రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

కోతుల బెడదపై వినతి..

ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు కోతుల బెడద తీవ్రంగా ఉందని, చిన్న మొక్కలు ధ్వంసమవుతున్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఇతర జిల్లాల మాదిరిగా కామారెడ్డి జిల్లాలో కూడా సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై స్పందించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అలాగే కోతుల నివారణకు సోలార్ ఫెన్సింగ్ సబ్సిడీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

Next Story