- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు షాకిచ్చిన హైకోర్టు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు దేవాలయ గర్భాలయాల్లో పూజలు నిర్వహించడంపై నిషేధాన్ని అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆధ్యాత్మిక, ధార్మిక నిబంధనల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు దేవాలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడంపై ఉన్న నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ తీర్పును వెలువరించారు.
2010లో దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్, 2024 డిసెంబరులో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వామివారు విడుదల చేసిన ‘ప్రామాణిక’ పత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటి ప్రకారం గర్భాలయంలో పూజలు చేసే అర్చకులు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాలి. నిత్యం త్రికాల సంధ్యావందనం, గురు ఉపదేశ మంత్ర జపం, వేద అధ్యయనం, కఠినమైన ఆహార నియమాలు పాటించేవారే గర్భాలయ పూజలకు అర్హులు. సంప్రదాయ ధర్మశాస్త్రాల ప్రకారం, అర్చకులు విదేశాలకు వెళ్లడం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల విదేశీ ప్రయాణం చేస్తే, వారు తిరిగి వచ్చాక గర్భాలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. వారిని కేవలం ఆలయ ప్రాకారం వెలుపల జరిగే వ్రతాలు, పూజలు లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే అనుమతించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారు తరచుగా సంప్రదాయాలకు విరుద్ధంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేస్తుంటారని, ఇవి గర్భాలయ అర్చకత్వానికి అనర్హతలుగా పరిగణించబడతాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన డి.ఎస్.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం సోమయాజి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, నిబంధనలను ఉల్లంఘించి అర్చకులను గర్భాలయాల్లోకి అనుమతిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది కూడా ఇకపై ఈ సర్క్యులర్లను, శారదా పీఠం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అర్చకుల నియామకాలు, వారి విధుల నిర్వహణలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.






