- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైమరీ హెల్త్ సెంటర్లకే పరిమితమా..?
నాడు ఎలా ఉన్నాయో.. నేడు కూడా అలానే ఉన్నాయి. జనాభా పెరుగుతోంది.. రోగులు పెరుగుతున్నారు.

దిశ, ధన్వాడ : నాడు ఎలా ఉన్నాయో.. నేడు కూడా అలానే ఉన్నాయి. జనాభా పెరుగుతోంది.. రోగులు పెరుగుతున్నారు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ ఆసుపత్రులకే క్యూ కడుతున్నారు. కానీ ఏం లాభం..? నాడు ఎలా ఉన్నాయో, నేడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అలానే ఉన్నాయి. పాలకులు మారుతున్నారు.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ ఆసుపత్రుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు" అనే పాట అందరూ విని ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులది. కానీ ఏళ్ల తరబడి ఆసుపత్రులు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల తీరు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యతో పాటు వైద్యానికి అధిక నిధులు కేటాయిస్తున్నామని బడ్జెట్‌లో గొప్పలు చెబుతున్నారు. అయినప్పటికీ ఆ గొప్పలు కాగితాలకే, మాటలకే పరిమితమయ్యాయి. వైద్య, విద్య రంగాలకు కోట్లాది రూపాయలు కేటాయించినట్లు చూపిస్తున్నప్పటికీ, ఆసుపత్రుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. మొత్తానికి ప్రభుత్వ దవాఖానాల స్థితిగతులు మారడం లేదు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లకే పరిమితమా..?
నారాయణపేట జిల్లాలో మక్తల్, కోస్గి, నారాయణపేటల్లో మాత్రమే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మరికల్, దామరగిద్ద, కృష్ణ, మాగనూరు, ధన్వాడ, ఉట్కూర్, గుండుమల్, పులిమామిడి, కోటకొండ తదితర ఆసుపత్రులు ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగానే కొనసాగుతున్నాయి. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేవలం ఆరు పడకలకే పరిమితమై ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరు పడకలకే పరిమితం కావడంతో పేద రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వాస్తవానికి మరికల్, ధన్వాడ, ఉట్కూర్‌తో పాటు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారి 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చెందాల్సి ఉండగా, పాలకులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంతో మంది ఎంపీలు మారారు.. ఎమ్మెల్యేలు మారారు.. మంత్రులు మారారు.. ప్రభుత్వాలు మారాయి. కానీ ఆసుపత్రులు ఎందుకు మారడం లేదని ఆయా మండలాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆరు పడకలున్న ఆరోగ్య కేంద్రాలను 30 పడకలకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నా, ఏ ప్రభుత్వంలోనూ చలనం కనిపించడం లేదు. నాడు ఉన్న జనాభానే ఇప్పుడు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనాభా పెరిగి రోగుల సంఖ్య అధికమైనప్పటికీ ఆసుపత్రులు మాత్రం ఆరు పడకలకే పరిమితమయ్యాయి. దీంతో సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. దీనికి తోడు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం, మందులు సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ధన్వాడ ఆసుపత్రి దుస్థితి మారదా..?
ధన్వాడ ఆసుపత్రి దుస్థితి పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. ప్రతి సారి ఈ ఆసుపత్రిని మరమ్మతులకే పరిమితం చేస్తున్నారు తప్ప, కొత్త భవన నిర్మాణానికి ఎవరూ నిధులు మంజూరు చేయడం లేదు. వర్షాకాలం వస్తే ఆసుపత్రి పైకప్పు పూర్తిగా కారుతోంది. తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అవి గుత్తేదారులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మరమ్మతులకు నిధులు కేటాయిస్తోంది. అయితే గుత్తేదారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కూడా నాణ్యతను పరిశీలించకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ధన్వాడ ఆసుపత్రికి తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు నాసిరకంగా జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో లైట్లు సరిగా లేవు. మంచినీటి సౌకర్యం లేదు. వర్షం వస్తే ఎక్కడ పైకప్పు కారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఆసుపత్రిని ఆరు పడకల నుంచి 30 పడకలకు మారుస్తామని ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు హామీ ఇస్తూనే ఉన్నారు. గెలుస్తున్నారు కూడా. కానీ ఆసుపత్రి మాత్రం ఇప్పటికీ ఆరు పడకలకే పరిమితమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. మరికల్ ఆసుపత్రిని కూడా 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు.
గైనకాలజిస్టు డాక్టర్ ఏర్పాటు లేనేలేదు...
ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నాయి. దీనికి తోడు గర్భిణీలు, బాలింతలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణీలు, బాలింతలు అధిక సంఖ్యలో వస్తుంటారు. వచ్చిన వారంతా అందుబాటులో ఉన్న వైద్యుడితోనే పరీక్షలు చేయించుకుని వెళ్తున్నారు. వాస్తవానికి కనీసం నెలకు ఒక్కసారైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకే గైనకాలజిస్టులను నియమిస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అలాంటి అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు అధికంగా వచ్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కనీసం నెలకు ఒక్కసారైనా గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ స్పందన కనిపించడం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కాన్పులు..
పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టు లేకపోయినా, అక్కడున్న వైద్యుల సలహాలతోనే సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక స్థోమత లేని అనేక కుటుంబాలు ప్రభుత్వ వైద్య సేవలనే ఆశ్రయించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకుంటున్నాయి. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో – 2,452 ప్రసవాలు, ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో – 986 ప్రసవాలు, గుండుమల్ ఆరోగ్య కేంద్రంలో – 2,002 ప్రసవాలు, కర్ణి ఆరోగ్య కేంద్రంలో – 2,716 ప్రసవాలు, కోటకొండ ఆరోగ్య కేంద్రంలో – 2,426 ప్రసవాలు, మద్దూర్ ఆరోగ్య కేంద్రంలో – 2,314 ప్రసవాలు, మాగనూరు ఆరోగ్య కేంద్రంలో – 1,684 ప్రసవాలు, మరికల్ ఆరోగ్య కేంద్రంలో – 1,066 ప్రసవాలు, నర్వ ఆరోగ్య కేంద్రంలో – 1,646 ప్రసవాలు, పులిమామిడి ఆరోగ్య కేంద్రంలో – 1,435 ప్రసవాలు, ఉట్కూర్ ఆరోగ్య కేంద్రంలో – 838 ప్రసవాలు, నారాయణపేట ఆరోగ్య కేంద్రంలో – 898 ప్రసవాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇంత పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్న నేపథ్యంలో, కనీసం నెలకు ఒక్కసారైనా ఆయా ఆరోగ్య కేంద్రాలకు గైనకాలజిస్టును నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం కనిపించడం లేదు.
ఆసుపత్రి స్థాయిని పెంచాలి.. గుర్రం రాజు బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలి. ప్రస్తుతం జనాభా పెరిగిపోయింది. రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు గర్భిణీలు, బాలింతలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ఆరు పడకల నుంచి 30 పడకలకు పెంచడంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టును ఏర్పాటు చేయాలి.






