- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలకు తండ్రి.. ‘ఆక్సిజన్ బాబా’
భారతదేశంలో ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కతో వచ్చి.. ఫొటోలు దిగి.. పేపర్లో వేయించుకుని.. చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత ఆ నాటిన మొక్కలు వేడి, ట్రాఫిక్ దుమ్ము, పశువుల నుంచి రక్షణ లేక చనిపోతాయి.

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కతో వచ్చి.. ఫొటోలు దిగి.. పేపర్లో వేయించుకుని.. చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత ఆ నాటిన మొక్కలు వేడి, ట్రాఫిక్ దుమ్ము, పశువుల నుంచి రక్షణ లేక చనిపోతాయి. ఈ విషయాన్నే గుర్తించిన ఓ సాధారణ వ్యక్తి వాటిని కాపాడుతూ ‘ఆక్సిజన్ బాబా’గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌కు చెందిన కుమ్మరి గోపాల్ ప్రతి ఏటా ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఎందుకు చనిపోతున్నాయో గమనించాడు. కేవలం కొత్త మొక్కలు నాటడం కాకుండా.. ఇప్పటికే ఉన్న.. బతికేందుకు పోరాడుతున్న మొక్కలను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 12 ఏళ్లుగా తన సమయం, డబ్బు, శక్తిని ఖర్చు చేసి.. కొన్ని కిలో మీటర్ల మేర.. రోడ్ల పక్కన నాటిన చెట్లకు నీరు పోస్తున్నాడు. ఒక తండ్రిగా వాటిని సంరక్షిస్తున్నాడు. ఈ పనే అతన్ని ‘ఆక్సిజన్ బాబా’ పేరుతో అప్యాయంగా పిలిచేలా చేసింది.
మట్టితో అనుబంధమే కారణం..
నిజానికి గోపాల్ బీసన్ కుండలు తయారు చేసి జీవనం సాగిస్తాడు. మట్టి, నీటితో రోజువారీ సంబంధం ఉండటం వల్ల చెట్లను పోషించాలనే సహజ స్పృహ ఏర్పడింది. మొదట్లో బకెట్లలో నీరు మోసుకుని పక్కనున్న రోడ్లలోని మొక్కలకు నీరు పోసేవాడు. ఎలాంటి ఫండింగ్ లేదు, సంస్థ లేదు. కేవలం మొక్కలు చనిపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టాడు. ఇప్పుడు సైకిల్ మీద 500 లీటర్ల నీటి ట్యాంకుతో విస్తృత ప్రాంతాల్లోని చెట్లకు నీరు పోస్తున్నాడు. తన కుమ్మరి చక్రం వద్ద చూపించే అదే క్రమశిక్షణతో ఈ పని చేస్తున్నాడు.
కాగ్ నివేదిక
కాగ్ (CAG) నివేదిక ప్రకారం.. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద నాటిన చెట్లలో 40% కంటే ఎక్కువ మొదటి సంవత్సరంలోనే చనిపోతాయి. మొదటి రెండు సంవత్సరాల్లో సరైన నీరు లభించకపోవడం.. రోడ్ల పక్కన మట్టి గట్టిపడటం వంటివి ఇందుకు కారణాలు. గోపాల్ ఈ అంతరాన్ని పూరించాడు. ప్రభుత్వం నాటిన మొక్కలను ఎవరూ చూసుకోకపోతే, తానే బాధ్యత తీసుకున్నాడు. ప్రారంభంలో చాలామంది అతని పనిని ఎగతాళి చేశారు. అయినా సరే సొంత డబ్బుతో నీరు, రవాణా ఖర్చులు భరించాడు. ప్రతి ఉదయం ట్యాంక్ నింపుకుని అదే రోడ్ల వెంబడి వెళ్లి మొక్కలకు నీరు పోశాడు. ముఖ్యంగా వేసవిలో ఇది చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు ఇది అతని రోజువారీ జీవితంలో భాగమైపోయింది.
‘ఆక్సిజన్ బాబా’ అని ఎందుకు పిలుస్తారు?
‘ఆక్సిజన్ బాబా’ పేరు అతని పని పట్ల ప్రజల ప్రేమ, గౌరవాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి. నీడను ఇస్తాయి. నగరాలను చల్లగా ఉంచుతాయి. గోపాల్ తన పనిని పెద్దగా చెప్పుకోరు. కానీ ఆ పేరు అతని సేవను సరిగ్గా వివరిస్తుంది. ఆయన కథ పర్యావరణ సేవ ఎలా ఉండాలో చూపిస్తుంది. దీనికి పెద్ద బడ్జెట్లు, ప్రభుత్వ పథకాలు అవసరం లేదని.. రోజూ ఒక ట్యాంకు నీటితో.. కరుణ, ఓపిక ఉంటే చాలు అని చెప్తుంది. ప్రకృతిని రక్షించడానికి ధనం కాదు నిబద్ధత ముఖ్యమని చాటి చెప్తుంది.






