అర్థరాత్రి ఢిల్లీలో హై అలర్ట్!

by Muthe.Rajitha |

ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో IED బాంబులతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు రావడంతో హై అలర్ట్ ప్రకటించారు.

అర్థరాత్రి ఢిల్లీలో హై అలర్ట్!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం అర్థరాత్రి హై అలర్ట్ ప్రకటించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఐఈడీ (IED) బాంబులతో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు రావడంతో రాజధాని పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉగ్రవాదులు రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు కీలక ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ముఖ్యంగా బీజేపీ ప్రధాన కార్యాలయం వంటి రాజకీయ కేంద్రాలతో పాటు, సామాన్యులు ఎక్కువగా సంచరించే మెట్రో స్టేషన్లపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించి, ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ దళాలను రంగంలోకి దించింది. నగరం అంతటా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నారు.

బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, స్నిఫర్ డాగ్స్ బృందాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ పరిణామాలు ఢిల్లీ వాసుల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, భద్రతా దళాల మోహరింపుతో నగరంలో కట్టుదిట్టమైన వాతావరణం నెలకొంది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ పై 'ఆపరేషన్ సింధూర్'తో విరుచుకుపడి, అక్కడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. కాగా ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి అత్యంత రహస్య సమాచారం అందింది. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

Next Story