- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ల ఫోన్ల ట్యాప్ ఇష్యూ.. కేటీఆర్ విచారణలో తేలిందిదే!
సిట్ విచారణలో తాను తప్ప ఏ రావూ లేరని.. ఆ అర్రలో ఆరుగురమే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సిట్ విచారణలో తాను తప్ప ఏ రావూ లేరని.. ఆ అర్రలో ఆరుగురమే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శుక్రవారం సిట్ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా తమ అసమర్థ పాలనను, పరిపాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి కథాచిత్రాలు నడుపుతున్నారని.. అందులో భాగంగా తనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని అన్నారు. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు, ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు.
లీకులతో వ్యక్తిత్వ హననం
ఈ సందర్భంగా తానూ అధికారులను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. ‘రెండేళ్లుగా విచారణ కొనసాగిస్తూ లీకుల మీద లీకులు ఇస్తున్నారు.. అవి మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేసే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరు’ అని అడిగినట్లు తెలిపారు. తమకు సంబంధం లేదని.. మీడియా ఏం రాస్తే తమకేం సంబంధమని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘కొంతమంది హీరోయిన్లను వీళ్లు ఏదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టమొచ్చినట్టుగా అడ్డగోలు వ్యాఖ్యలు రాసినారు. ఇది వాస్తవమా? వాస్తవమైతే మా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి ఏవరు సమాచారం ఇచ్చారు’ అని అడిగినట్లు తెలిపారు. అక్కడ ఉన్న అధికారి ‘లేదండి.. అది కరెక్ట్ కాదు. మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా’ అని బదులిచ్చినట్లు తెలిపారు. ఇన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? తమ కుటుంబాలకు, తమకు కలిగిన క్షోభకు, తమ వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులను నిరోధించలేరా అని ప్రశ్నించారు. ‘దయచేసి.. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం. కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను మీడియా కూడా ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత? ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని’ మీడియాకు అప్పీల్ చేశారు. హరీశ్‌రావు విచారణ సందర్భంగానూ అనేక అడ్డగోలు లీకులిచ్చారని అన్నారు. రెండేళ్లు అయిపోయిందని.. కాలక్షేపం జరగాల్సింది జరిగిందని.. ప్రజలకు అందించాల్సిన వినోదం అందించారని.. కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి అని కోరారు. తమకూ కుటుంబాలు ఉన్నాయని.. తమకూ అభిమానులు ఉన్నారని.. తమ నియోజకవర్గాల్లో ఆశలు పెట్టుకున్న ప్రజలు ఉన్నారని.. వాళ్ళు బాధపడతారని తెలిపారు.
మా ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా..?
ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, తమ ఎమ్మెల్యేలు, తమ నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని అధికారులను అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. వాళ్ళు ‘మాకేం సంబంధం, మాకు తెలవదు’ అని నీళ్లు నమలడం తప్ప, కావడం లేదని చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఒక మంత్రి స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని.. తాను మీతో మాట్లాడలేనని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి రాష్ట్రంలో ఉన్నదన్నారు. దానికి కూడా వారు తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో, అదే పరంపరలో అడిగిన ప్రశ్నలే అడుగుతూ మళ్ళీమళ్ళీ అడుగుతూ.. ఒక 300 పేర్లు చదువుతూ ఈయన తెలుసా, ఆయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా అని దాంతోనే ఎనిమిది గంటలు టైంపాస్ చేశారని ఆరోపించారు. అంతే తప్పితే అక్కడ విషయం ఏంలేదన్నారు. తాము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎన్ని కేసులలైనా పెట్టండి, ఎన్ని సిట్లన్నా వేయండి.. సహకరిస్తామని చెప్పారు. అలాగే.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని సైతం కచ్చితంగా తాము ఎత్తిచూపే ప్రయత్నం చేస్తునే ఉంటామని అన్నారు. సింగరేణి టెండర్లలో సీఎం, మంత్రుల మధ్య వాటాల పంచాయితీలో దొంగలు దొరికారని చెప్పి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి ఆధారాలతో సహా చెప్తే ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదన్నారు. సీఎం అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అలాగే మంత్రి ఓఎస్డీ మధ్య జరిగిన పంచాయితీ.. రూ.300 కోట్ల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారని చెప్పి కేసు నమోదైతే దాని మీద సిట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైరవిహారం చేస్తుంటే దానిపైనా సిట్ వేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్‌లో సీఎం బావమరిది కింగ్ పిన్‌గా అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని.. ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదని అన్నారు. అలాగే ఓ ఏఐసీసీ సెక్రెటరీ డైరెక్ట్‌గా బెదిరించారని చెప్పి కాంట్రాక్టర్ సంస్థ పోయి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ ఆరు గ్యారెంటీల అమలుపై, పరిపాలనలోని వైఫల్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
నేను ఏనాడూ అక్రమాలకు పాల్పడలేదు
పదిహేనేళ్లుగా తాను రాష్ట్రం కోసం పనిచేశానని.. ఎప్పుడూ టైం పాస్ రాజకీయాలు చేయలేదని కేటీఆర్ వెల్లడించారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదని.. అక్రమ కేసులు పెట్టి వేధించలేదని చెప్పారు. కానీ.. రెండేళ్లుగా ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు అని తెలిపారు. ‘నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా. నేను ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదు’ అని స్పష్టం చేశారు. గత ఏడెనిమిది నెలలుగా తనమీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) జరుగుతున్నదని.. ఏదో డ్రగ్స్ కేసుల్లోనో, హీరోయిన్లతో సంబంధాలనో ఇరికించాలని చూశారని.. తనను కాకుండా తన కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు పిలిచారననారు. ‘నా పరువుకు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్‌రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసువోళ్లు బాధ్యులా? రాసిన మీడియా వాళ్లు బాధ్యులా?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జనార్ ముందుకు వస్తాడా? అని నిలదీశారు. 2015లో రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో తమ ఎమ్మెల్యేను కొనడానికి ఒక దొంగ రూ.50 లక్షల బ్యాగుతో వచ్చి దొరికిపోయిండని.. ఆ దొంగ మీద ఏమన్నా పోలీసులు నిఘా పెట్టిండ్రేమో అది తమకేం తెలుసని ప్రశ్నించారు. ఎనుముల రేవంత్‌రెడ్డి, ఎగవేతల రేవంత్‌రెడ్డిగా ఎట్లా మారిపోయాడో అన్న దాని మీద.. 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటామన్నారు. వంద శాతం వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటామన్నారు.






