బైపాస్ వదిలి మెయిన్ రోడ్ పైకి భారీ వాహనాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-23 02:16:10  IST  )

"కొడిమ్యాలలో భారీ వాహనాల జోరు.. నిద్రలేక ప్రజల అవస్థలు! అక్రమ రవాణాపై తహసీల్దార్ కిరణ్ సీరియస్ హెచ్చరిక. బైపాస్ వాడాలని స్థానికుల డిమాండ్."

బైపాస్ వదిలి మెయిన్ రోడ్ పైకి భారీ వాహనాలు
X

దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక, మట్టి వాహనాలు, అలాగే పొద్దునంతా కంకరతో నిండిన టిప్పర్ లారీలు, భారీ వాహనాలు గ్రామ ప్రధాన రహదారి గుండా దూసుకుపోవడం వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపార సమయంలో వినియోగదారులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు.

బైపాస్ ఉన్నా ఉపయోగం శూన్యం

బైపాస్ రహదారి అందుబాటులో ఉన్నప్పటికీ డ్రైవర్లు గ్రామ మెయిన్ రోడ్డునే వినియోగించడం వెనుక కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి నిద్ర లేక ప్రజల బెంబేలెత్తింపు, శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

మితిమీరిన వేగం

వేగంగా దూసుకుపోతున్న వాహనాలు ఎప్పుడైనా అదుపుతప్పి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో గ్రామంలోని సీసీ రహదారులు పాడైపోతున్నాయని, ప్రజా ధనం వృథా అవుతుంది ప్రజలలో అసహనం వ్యక్తమౌతుంది.

అక్రమ రవాణాపై ప్రజల ఆగ్రహం

ఇసుక, మట్టి అక్రమ రవాణా అర్ధరాత్రి సాగుతుండటం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేపుతోంది. అనుమతి లేకుండా నడుస్తున్న ఈ వాహనాలు కేవలం రహదారులనే కాదు, గ్రామ వాతావరణాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ‘ప్రజల నిద్రను దోచుకుంటూ, గ్రామాన్ని నాశనం చేస్తూ లాభాలు పొందే వారిని కఠినంగా శిక్షించాలి’ అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​

అనుమతి లేని వాహనాలపై కేసులు నమోదు చేసి, ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, బైపాస్ రహదారి వినియోగం తప్పనిసరి చేయాలని, రాత్రివేళల్లో పోలీసు పహారా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ రవాణాపై కఠిన చర్యలు

అనుమతులు లేకుండా మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్థానిక తహసీల్దార్ కిరణ్ తెలిపారు. సహజ వనరులను ఎవరైనా ప్రభుత్వ అనుమతి తో తరలింపులు చేపట్టాలని లేనియెడల వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.-తహసీల్దార్ కిరణ్

Next Story