నిర్లక్ష్యం నీడలో అడవి!

by velandi.Saikiran |   (  Updated:2026-07-02 23:30:40  IST  )

దేశంలోనే భద్రాచలం అటవీ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

నిర్లక్ష్యం నీడలో అడవి!
X

భద్రాచలం డివిజన్‌లో వేలాది హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉన్నా.... అటవీ అధికారులు ప్లాంటేషన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ 42వేల హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉన్నా. అందులో కేవలం 856హెక్టార్లలోనే ప్లాంటేషన్ ఉండగా, మిగిలిన భూమిలో ప్రకృతి సిద్దమైన ఫారెస్ట్ ఉంది. నేచరల్ ఫారెస్ట్ ఏరియా లో ఉన్న చెట్లలో 80శాతం వరకూ ఉపయోగపడేవి కావు. వీటితో అటు అటవీశాఖకు గాని, ఇటు అటవీ ఉత్పత్తులు పై ఆధారపడి జీవించే గిరిజనులకు గాని ప్రయోజనం లేదు. ప్లాంటేషన్ పై నిర్లక్ష్యానికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమేనని తెలుస్తున్నది. 28చెక్‌డామ్‌లు అటవీ జంతువులు దాహర్తి తీర్చుకోవడం, భూగర్భ జలాలు పెరిగేందుకు నిర్మించగా, గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాక.. నిర్వహణ లేక చెక్ డామ్స్ కనుమరుగయ్యాయి. ఫలితంగా దాహంతో వణ్యప్రాణులు మరణిస్తున్నాయి.

దిశ, భద్రాచలం: దేశంలోనే భద్రాచలం అటవీ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాని ప్రస్తుతం ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలోని అడవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లో మొత్తం 42,178.005 హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉంది. దీనిలో కేవలం 856.5 హెక్టార్లలోనే ప్లాంటేషన్ ఉంది. మిగిలిన భూమిలో ప్రకృతి సిద్దమైన ఫారెస్ట్ ఉంది. నేచరల్ ఫారెస్ట్ ఏరియా లో ఉన్న చెట్లలో 80శాతం వరకూ ఉపయోగపడేవి కావు. వీటితో అటు అటవీశాఖకు గాని, ఇటు అటవీ ఉత్పత్తులు పై ఆధారపడి జీవించే గిరిజనులకు గాని ప్రయోజనం లేదు. వేలాది హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉన్నా.... అటవీ అధికారులు ప్లాంటేషన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడమే. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో అడవి కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.

కనుమరుగైన చెక్ డ్యామ్‌లు

భద్రాచలం డివిజన్ లోని ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం 28చెక్ డామ్స్ ఉన్నాయి. ఈ చెక్ డామ్స్ లో నీరు నిల్వ చేయడం వలన అటవీ జంతువులు దాహర్తి తీర్చుకోవడంతో పాటు, ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి అటవీ విస్తరణకు ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం వేసవిలో చెక్ డామ్స్ లో పూడిక తీయాల్సి ఉంటుంది. దీనిద్వారా వర్షాకాలంలో ఎక్కువ నీరు నిలవడానికి అవకాశం ఉంది. అయితే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో నిర్వహణ లేక చెక్ డామ్స్ కనుమరుగయ్యాయి. నూతన చెక్ డామ్స్ కూడా నిర్మించక పోవడంతో, అడవి జంతువులు తాగడానికి నీరు లేక మరణిస్తున్నాయి.

100హెక్టార్లలో 2లక్షల మొక్కలు నాటుతున్నాం: ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు

2026-27 సంవత్సరంలో 100 హెక్టార్లలో నూతన ప్లాంటేషన్ వేయబోతున్నాం. భద్రాచలం రేంజ్ లో 50 వేల మొక్కలు, దుమ్ముగూడెం రేంజ్ లో లక్ష మొక్కలు, చర్ల రేంజ్ లో 50 వేల మొక్కలు నూతనంగా నాటుతున్నాము. దీని కోసం రూ.45,34,918 నిధులు వెచ్చిస్తున్నాం. భవిష్యత్ లో ప్లాంటేషన్ ఏరియా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాము.

Next Story