తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 3 గంటలపాటు జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

by Muthe.Rajitha |

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటలపాటు తీవ్రమైన ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 3 గంటలపాటు జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : మార్చి నెల మొదట్లోనే తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్న నేపథ్యంలో మరో 3 గంటలపాటు ప్రజలెవరూ ఇళ్ళు దాటి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, అదిలాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 39-41°C స్థాయికి చేరుకోగా.. రాబోయే మూడు, నాలుగు రోజులు (మార్చి 7-10 వరకు) ఇదే విధమైన హీట్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని HMD పేర్కొంది. తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో కనిపించే ఎండలు ఇప్పుడే మొదలవ్వడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కూడా ఎప్పుడూ లేనంతగా మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37-38°C గా నమోదయ్యాయి. గత మూడు రోజుల నుంచి తీవ్రమైన ఎండకు నగరవాసులు అల్లాడి పోతున్నారు. ఇక మార్చి నెలలోనే ఎండలు ఇంతలా ముదరడం వల్ల పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. భూగర్భ జలమట్టం కూడా భారీగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్‌కు, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story