- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రావణ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం గన్నవరం న్యాయస్థానంలో కీలక విచారణ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : 'ప్రశ్న' యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం గన్నవరం న్యాయస్థానంలో కీలక విచారణ జరగనుంది. దేశద్రోహ వ్యాఖ్యలు, నిషేధిత మావోయిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన ఉపా (UAPA - చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కేసులో ఆయన్ను విచారించేందుకు తమకు అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ ఐదో కేసులో రావణ్‌ను కస్టడీకి తీసుకోవడం ద్వారా అతని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఇతర దేశ వ్యతిరేక శక్తులతో ఉన్న సంబంధాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకోసం రావణ్‌ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.
మరోవైపు, ప్రశ్న రావణ్ ఇప్పటికే ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ నెల 18తో ముగియనుంది. అంతకుముందు అతనిపై నమోదైన నాలుగు వేర్వేరు కేసుల్లో రావణ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఈ తాజా UAPA కేసు తీవ్రత దృష్ట్యా ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. గత వారం జరిగిన విచారణ సందర్భంగా రావణ్ తరఫు న్యాయవాదులు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాంతో న్యాయమూర్తి తదుపరి విచారణను నేటికి వాయిదా వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పోలీసులకు కస్టడీ మంజూరు చేస్తుందా లేదా అనే అంశంపై మధ్యాహ్నం వరకు స్పష్టత రానుంది.






