హత్యకేసు.. 23 మంది పోలీసుల బదిలీ

by Muthe.Rajitha |

ఒక మర్డర్ కేసులో నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.

హత్యకేసు.. 23 మంది పోలీసుల బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక మర్డర్ కేసులో నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారి హత్య కేసు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, నిందితులతో కుమ్మక్కై కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌పై ఉన్నతాధికారులు ఊహించని రీతిలో కఠిన చర్యలు తీసుకున్నారు. ఈకేసులో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రుజువు కావడంతో స్టేషన్ లో ఉన్న మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు CI మాతంగి శ్రీనివాసరావును వేకన్సీ రిజర్వ్ కు పంపుతూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేయగా, స్టేషన్‌లోని మిగిలిన 22 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పక్కా ప్లాన్..

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘోర ఉదంతం నేపథ్యం పరిశీలిస్తే.. జూన్‌ 15వ తేదీన బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారి (AO) ఎన్‌.శ్రీహరిని, అతని బావమరిది హరికృష్ణ కారులో పెంచలకోనకు తీసుకెళ్లారు. అయితే తిరిగి వస్తున్న మార్గమధ్యంలో వ్యవసాయాధికారి శ్రీహరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నిందితుడు హరికృష్ణ దీనిని సహజమైన గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ, శ్రీహరి శరీరంపై గాయాలుండటాన్ని మృతుడి బంధువులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అప్పట్లో ఘటనా స్థలానికి వచ్చిన సీఐ శ్రీనివాసరావు ప్రాథమికంగా పరిశీలించి వెళ్ళిపోయారే తప్ప.. కేసు నమోదు చేయడం కానీ, అనుమానితులను విచారించడం కానీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.

సిఐ అండదండలు

ప్రభుత్వ వ్యవస్థలు స్పందించకపోవడంతో విసిగిపోయిన మృతుడి భార్య లావణ్య, తన భర్త పక్కా ప్రణాళికతో హత్యకు గురయ్యారంటూ జులై 6న పోలీస్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎస్పీ అజిత వేజెండ్ల.. సమగ్ర విచారణ జరపాల్సిందిగా డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆదేశించారు. డీఎస్పీ నేతృత్వంలో సాగిన లోతైన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆస్తి కోసం బావమరిది హరికృష్ణ.. క్రూరంగా కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి వ్యవసాయాధికారి శ్రీహరిని హతమార్చినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది.

స్టేషన్ మొత్తం బదిలీ

ఈ దారుణ హత్యతో పాటు స్థానిక పోలీసుల అవినీతి, అక్రమాలు కూడా డీఎస్పీ దర్యాప్తులో బట్టబయలయ్యాయి. నిందితుడు హరికృష్ణతో సీఐ శ్రీనివాసరావు నేరుగా కుమ్మక్కై, కేసును తొక్కిపెట్టేందుకు పెద్ద ఎత్తున బేరం కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. సీఐతో పాటు స్టేషన్‌లోని మిగతా సిబ్బంది కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, శాక్ష్యాధారాల ధ్వంసానికి సహకరించినట్లు తేలింది. ఖాకీల అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పీఎస్ సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి ఊడ్చేస్తూ బదిలీ వేటు వేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

Next Story