పేరుకే 'ఫ్రైడే–డ్రైడే'..!

by Batti.Sumithra |

దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారాన్ని 'ఫ్రైడే–డ్రైడే'గా నిర్వహించాలని ఆదేశించింది.

పేరుకే ఫ్రైడే–డ్రైడే..!
X

దిశ, ఆలూర్ : దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారాన్ని 'ఫ్రైడే–డ్రైడే'గా నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి ఇంటిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వ్యాపార సంస్థల్లో నిల్వ నీటిని తొలగించి దోమల ఉత్పత్తిని అరికట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అయితే, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అమలవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి శుక్రవారం ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి ఇంటింటికీ వెళ్లి కూలర్లు, పూల కుండీలు, నీటి డబ్బాలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఫ్రిజ్ ట్రేలు, సిమెంట్ ట్యాంకులు తదితర వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. 'వారానికి ఒక రోజు – పది నిమిషాలు' అనే నినాదంతో ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చైతన్యం తీసుకురావాల్సి ఉంటుంది.

అయితే జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో ఈ దృశ్యాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సిబ్బంది కొద్దిసేపు సమావేశం నిర్వహించడం, ఫోటోలు తీసి అధికారిక గ్రూపుల్లో పంపించడం మినహా ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించే చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో నిల్వ నీరు ఉన్న ప్రదేశాలను గుర్తించి తొలగించడం, దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టడం, ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరగడం లేదని ప్రజలు అంటున్నారు. ఇదే సమయంలో జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఖాళీ స్థలాలు, కాలనీలు, గ్రామాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో దోమల వ్యాప్తి వేగంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ముందస్తు చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ఇలాంటి కీలక కార్యక్రమం కేవలం నివేదికలు, ఫోటోలకే పరిమితమైతే అసలు లక్ష్యం ఎలా నెరవేరుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో 'ఫ్రైడే–డ్రైడే' కీలక కార్యక్రమంగా భావిస్తున్న ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రతి గ్రామంలో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నిల్వ నీటి నిర్మూలన, దోమల లార్వా నియంత్రణ, ఇంటింటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తేనే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను సమర్థంగా నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం : డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, ఆర్మూర్

ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహిస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్ తెలిపారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సరిదిద్ది, కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా వారానికి ఒకసారి తమ పరిసరాల్లో నిల్వ నీటిని తొలగించి ఆరోగ్యశాఖకు సహకరించాలని రవీందర్ కోరారు.

Next Story