పోలీస్ పహరా మధ్య గ్రామ సభ!

by Ratna Kumari |

మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ, భారీ పోలీస్ పహరా మధ్య భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించారు.

పోలీస్ పహరా మధ్య గ్రామ సభ!
X

దిశ, గంగాధర : మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ, భారీ పోలీస్ పహరా మధ్య భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ దీకొండ బాబా లక్ష్మీ మధు, అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ కు ముఖ్యఅతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి షర్మిల తో పాటు భూసేకరణ ప్రత్యేక అధికారి జె స్వామి ఈ సమావేశాన్ని కొనసాగించారు. నారాయణపూర్ పరిధిలో చేపట్టబోయే భూసేకరణపై గ్రామస్తుల నుండి గత కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా నీడలోనే ఈ గ్రామ సభను ప్రారంభించారు. గ్రామ సభ ప్రారంభం కాగానే స్థానిక రైతులు, భూ యజమానులు, గ్రామస్తులు అధికారుల ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఒకే నినాదంతో అధికారులను నిలదీశారు. భూసేకరణ పేరుతో గ్రామంలోని కొన్ని ఇళ్లను సేకరించి, మరికొన్ని ఇళ్లను వదిలేయడం వల్ల తమ గ్రామాన్ని రెండుగా చీల్చినట్టు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. "మా ఊరిని రెండు ముక్కలుగా చీల్చొద్దు.. కొన్ని ఇళ్లను వదిలేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. అవసరమైతే నారాయణపూర్ గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించి, అందరికీ న్యాయం చేయాలి" అని గ్రామ సభలో ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. తరతరాలుగా కలిసిమెలిసి ఉంటున్న ఊరిని విడదీయవద్దని, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల సేకరణపై తమకున్న అభ్యంతరాలను అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రామస్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో అధికారులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నారాయణపూర్ గ్రామ సభలో గ్రామస్తులు వ్యక్తపరిచిన ప్రతి ఒక్క అభ్యంతరాన్ని, ముఖ్యంగా గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలనే వారి డిమాండ్‌ను సమగ్రంగా రికార్డు చేశామని తెలిపారు.

ఈ వివరాలన్నింటినీ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వల్ల గ్రామ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని, ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామస్థులు అధికారులకు పూర్తిగా సహకరించాలని ఆర్డిఓ షర్మిల కోరారు. గ్రామ సభ ముగిసిన అనంతరం ఆర్డీవో, భూసేకరణ ప్రత్యేక అధికారి రెవెన్యూ సిబ్బందితో కలిసి నారాయణపూర్ చెరువు కట్ట పరిసర ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గ్రామస్తులను సైతం వెంటబెట్టుకుని భూములు, ఇళ్లు, చెరువు కట్ట నిర్మాణ ప్రాంతం, ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్న స్థలాలను స్వయంగా పరిశీలించారు.సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు సేకరించారు. భారీ పోలీస్ పహరా నడుమ జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ ప్రత్యూష, రూరల్ ఏసిపి విజయ్ కుమార్, ఇరిగేషన్ డిఇలు, ఆర్ఐ సంతోష్ కుమార్, సర్వేయర్ కుమార్, ఇరిగేషన్ ఏఈలు, జిపి ఓజి శైలజల, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో నారాయణపూర్ గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Next Story