సైబర్ నేరాలే భవిష్యత్‌లో అతిపెద్ద సవాలు: డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణపై డీజీపీ సీవీ ఆనంద్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సైబర్ నేరాలే భవిష్యత్‌లో అతిపెద్ద సవాలు: డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్ తదితర విభాగాలను ఆయన సందర్శించారు. వాటి పనితీరు, సాంకేతిక సామర్థ్యాలు, దర్యాప్తు విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు. ఇందులో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఐపీఎస్‌తో పాటు ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు విధానాలు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం, బాధితులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీకి వివరించారు.

AI ఆధారిత కాల్ సెంటర్ పనితీరుపై డీజీపీ ప్రశంసలు..

సమీక్షలో సందర్భంగా డీజీపీ స్వయంగా AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. ‘నేను సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయాను’ అని బాధితురాలు చెప్పగానే AI వ్యవస్థ వెంటనే స్పందించి, ఆమెకు ధైర్యం చెబుతూ పేరు, ప్రాంతం, సమీప పోలీస్ స్టేషన్, సంఘటన వివరాలను సేకరించింది. అదే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని డీజీపీ పరిశీలించి అభినందించారు. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు AI ఆధారిత సేవలను విస్తరించాలని అధికారులకు సూచించారు.

సైబర్ నేరాల నియంత్రణలో ఆశాజనక ఫలితాలు

సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైంది. అదే విధంగా సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదులలో కూడా 3 శాతం తగ్గుదల నమోదైంది. నేరస్తుల ఖాతాల్లోని నిధులను నిలిపివేసే POH (Hold) మొత్తం రూ. 255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు పెరగగా, POH శాతం 9 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ఇది బాధితుల సొమ్ము రక్షణలో తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనమని అధికారులు వివరించారు.

సైబర్ నేరాల గుర్తింపు, నమోదులో తెలంగాణ రికార్డు

2025లో దేశవ్యాప్తంగా నమోదైన 49,620 సైబర్ ఎఫ్‌ఐఆర్‌లలో (FIR) తెలంగాణలోనే 21,639 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ ఎఫ్‌ఐఆర్‌లలో 44 శాతం తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే రూ.75 లక్షలకు పైగా నష్టం కలిగిన కేసుల్లో 78 శాతం, రూ.1 లక్షకు పైగా నష్టం ఉన్న కేసుల్లో 56 శాతం ఎఫ్‌ఐఆర్ కన్వర్షన్ రేటు నమోదు కావడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని అధికారులు వివరించారు.

ఇతర నేరాల కంటే సైబర్ నేరాల వల్లే అత్యధిక ఆర్థిక నష్టం

2025లో రాష్ట్రంలో నమోదైన 86,177 ప్రధాన నేరాల ఎఫ్‌ఐఆర్‌లలో 21,639 సైబర్ నేరాలకు సంబంధించినవే. అంటే ప్రతి నాలుగు ప్రధాన నేరాల ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి సైబర్ నేరానిదే కావడం గమనార్హం. ఇతర ప్రధాన నేరాల వల్ల రూ. 207 కోట్ల ఆర్థిక నష్టం జరగగా, సైబర్ నేరాల వల్ల ఏకంగా రూ. 1,524 కోట్ల నష్టం సంభవించింది. అంటే ఇతర ప్రధాన నేరాల కంటే దాదాపు ఏడు రెట్లు అధిక ఆర్థిక నష్టం సైబర్ నేరాల వల్లే జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని అన్నారు. జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపులను ఒక్క క్షణంలో కోల్పోతున్నారని కామెంట్ చేశారు. భవిష్యత్‌లో నేరాల స్వరూపం ప్రధానంగా సైబర్ నేరాల చుట్టూనే తిరుగుతుందని అన్నారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట సందర్శించిన ప్రత్యేక విభాగాల్లో ఈగిల్ (EAGLE) ఒకటి కాగా, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర భద్రతలో ఈ రెండు విభాగాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.

సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కొత్త ఆలోచనలు, కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్ వినియోగిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సీవీ ఆనంద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జాతీయ పనితీరు సూచికల్లో తెలంగాణ మరింత మెరుగైన స్థానం సాధించేలా సాంకేతిక వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాల పునర్వ్యవస్థీకరణతో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. అవసరమైతే మానవ వనరులను సమర్థంగా వినియోగించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్న డీజీపీ, ఇప్పుడే వీటిని సమర్థంగా నియంత్రించకపోతే భవిష్యత్‌లో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణను సాంకేతికత ఆధారిత సైబర్ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోలీసుల కీలక విజ్ఞప్తి..

ప్రజలు సైబర్ మోసాలకు గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. ఓటీపీలు (OTP), పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు, ఇతర ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దని తెలంగాణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఎస్పీలు హర్షవర్ధన్, సాయి శ్రీ, డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story