- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో 8 మందికి జైలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 2019 నాటి ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ,ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 2019 నాటి ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాగజ్‌నగర్ మండలం సారసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు మొత్తం 8 మంది నిందితులకు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. 2019 జూన్ 30న కాగజ్‌నగర్ మండలం సారసాల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిని అడ్డుకుని దాడి చేసిన ఘటనపై ఫారెస్ట్ రేంజ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, దాడి చేయడం, బెదిరించడం తదితర అభియోగాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలు, పత్రాలను సుదీర్ఘంగా పరిశీలించిన జిల్లా కోర్టు కోనేరు కృష్ణతో పాటు మరో ఏడుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది.దీంతో వారందరికీ ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు వివిధ సెక్షన్ల కింద జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.ఏళ్లుగా విచారణ కొనసాగిన ఈ కేసులో వెలువడిన తాజా తీర్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, వారిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసినట్లైంది. ఈ కేసులో ప్రభుత్వ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ) రమణారెడ్డి వాదనలు వినిపించారు. జిల్లా కోర్టు వెలువరించిన తీర్పు వివరాలను ఎస్‌పీపీ రమణారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న వ్యక్తికి శిక్ష పడటం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు తీర్పుతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారగా,ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, వారిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు స్పష్టం చేసినట్లైంది.






