వరల్డ్ నం.5కి షాకిచ్చిన సింధు.. జపాన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు క్వాలిఫై

by Harish |

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సత్తాచాటుతోంది.

వరల్డ్ నం.5కి షాకిచ్చిన సింధు.. జపాన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సత్తాచాటుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో ఆమె తన కంటే మెరుగైన ర్యాంకర్ అయిన వరల్డ్ నం.5 హాన్ యూ(చైనా)‌కు షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. 35 నిమిషాల్లోనే సింధు వరుసగా రెండు గేముల్లోనూ నెగ్గింది. హాన్ యూపై సింధుది తిరుగులేని తిరుగులేని ఆధిపత్యం. ఈ మ్యాచ్‌కు ముందు 8 మ్యాచ్‌ల్లో ఎదురుపడితే ఏడింట సింధునే గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు గేముల్లోనూ సింధు దూకుడు ముందు ప్రత్యర్థి నిలువలేకపోయింది. ఈ సీజన్‌లో సింధు క్వార్టర్స్‌కు చేరుకున్న 6వ టోర్నీ ఇది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ రెండో రౌండ్‌లో ఓడిపోయింది. చైనాకు చెందిన ఫెంగ్ యాన్ జీ-హువాంగ్ డాంగ్ పింగ్ జంట చేతిలో 22-20, 21-17 తేడాతో పోరాడి ఓడింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టి, ఉన్నతి హుడా ఇప్పటికే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌,చిరాగ్ జోడీ గాయం కారణంగా తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగింది. దీంతో ఇప్పుడు టోర్నీలో భారత్ తరపున మిగిలిన ఏకైక ప్లేయర్ సింధు.అయితే, క్వార్టర్స్‌లో ఆమెకు కఠిన సవాల్ ఎదురైంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఆమె వరల్డ్ నం.1 క్రీడాకారిణి నోజోమి ఒకుహరా(జపాన్)‌ను ఎదుర్కోనుంది.


Next Story