సీజనల్ వ్యాధుల పై ఆరోగ్య శాఖ అప్రమత్తం

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ బుధవారం నిర్మల్ జిల్లా కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సీజనల్ వ్యాధుల పై ఆరోగ్య శాఖ అప్రమత్తం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ బుధవారం నిర్మల్ జిల్లా కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఓపీ సేవలు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వర్షాకాలంలో చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల పై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, కార్యక్రమ నిర్వహణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణంలో జ్వరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ జ్వరాల కేసులను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం వచ్చిన వెంటనే స్వీయ వైద్యం చేసుకోకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అంటువ్యాధుల నియంత్రణ చర్యలు, ఆరోగ్య సంస్థల్లో మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరుపై కూడా ఆయన సమీక్ష నిర్వహించి, అన్ని ఆరోగ్య కార్యక్రమాలను లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్ నయనా రెడ్డి, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ పవన్, డాక్టర్ రాకేష్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ శివకుమార్, జిల్లా డిప్యూటీ విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Next Story