- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌పై కొత్త క్విడ్ ప్రో కో ఆరోపణలు.. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
మాజీ మున్సిపల్ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా క్విడ్ ప్రోకో డీల్ బయటకు వచ్చిందని, ఇందులో కేటీఆర్ వాటా ఎంతో తేలాలని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మున్సిపల్ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా క్విడ్ ప్రోకో డీల్ బయటకు వచ్చిందని, ఇందులో కేటీఆర్ వాటా ఎంతో తేలాలని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ సమీపంలో సర్వే నెంబర్ 22లో రెండు ఎకరాల భూమిలో ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో బ్లిస్ పేరుతో 17 అంతస్తుల్లో రెండు టవర్లు నిర్మించిందని, నిర్మాణ ప్రాంతం ఏకంగా 98 శాతం ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంది, రెండు శాతం బఫర్ జోన్ లో ఉందని ఆయన తెలిపారు. బుధవారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ నిర్మాణ సమయంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్, జీహెచ్ఎంసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, చెరువులు, కాలవలు, కుంటల పక్కన ఉన్న భూముల కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ అడగాలన్నారు. కానీ, యాజమాన్యం కాని, అధికారులు కూడా దీన్ని పట్టించుకోలేదని అద్దంకి దయాకర్ ఆరోపించారు.
స్థలం యజమానితో వివాదం ఉన్నప్పటికి ఆయనను బెదిరించి కోర్టు బయటే అప్పటి అధికార పార్టీ నాయకుల అండతో సెటిల్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయని ఆయన తెలిపారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని, మా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి 7359 చదరపు అడుగులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేల్చారు, ఇంకో 280 చదరపు అడుగులు బఫర్ జోన్ లో ఉన్నట్లు తేలిందని అద్దంకి దయాకర్ వెల్లడించారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంత విచ్చలవిడిగా నిర్మాణం ఏ ధైర్యంతో జరిగిందని, ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణం జరిగిందో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ప్రమేయం లేకుండా జరుగుతుందా? కేటీఆర్ వైపే వేలు చూపిస్తోందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ బెదిరించి అధికారులతో ఈ పనిచేశాడని, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ అసలు యజమాని ప్రదీప్ రెడ్డి అని, ఈ ప్రదీప్ రెడ్డి చెందిన నిర్మాణ సంస్థనే హుస్సేన్ సాగర్ పక్కన టవర్లు నిర్మించిందని అద్దంకి దయాకర్ ఆరోపించారు.
ప్రదీప్ రెడ్డికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్‌లో అసలు కేటీఆర్ ఎందుకు ఉంటున్నాడు? హుస్సేన్ సాగర్ పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా టవర్లు నిర్మించుకోవడం కోసమే కేటీఆర్ ప్రదీప్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ ఇచ్చాడని, ఇది క్విడో ప్రోకోలో భాగమే అని ఆయన ఆరోపణలు గుప్పించారు. నీకు టవర్లు, నాకు ఫామ్ హౌస్ అని ఇద్దరు పంచుకున్నారని, క్విడ్ ప్రోక్ వ్యవహారంపైన విచారణ జరిపి కేటీఆర్ పాత్రను తేల్చాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నామని అద్దంకి దయాకర్ తెలిపారు. బాధ్యులని అరెస్టు చేయాల్సిందే, ఈ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ భాగోతాలను ఎంపీగా ఉన్న సమయంలో మా సీఎం రేవంత్ రెడ్డి బట్టబయలు చేశారని, ఆ సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ సమీపంలోకి వెళ్లి మీడియాకు చూపించారన్న కక్షతో డ్రోన్ కేసు పెట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారన్నారు.
అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలియకుండా సెక్రటేరియట్ కు కూతవేటు దూరంలో 17 అంతస్తుల భవనం ఎలా నిర్మించారు..? అనుమతులు తీసుకోకుండా అడ్గగోలుగా కడుతుంటే ఎందుకు కేటీఆర్ ఆపలేదు..? అని ఆయన ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ కోసం అడ్డగోలు నిర్మాణానికి కేటీఆర్ అనుమతి ఇచ్చారని, అధికారులపైన ఒత్తిడి తెచ్చి నిర్మాణాన్ని ఆపకుండా కేటీఆర్ అడ్డుకున్నాడని అద్దంకి దయాకర్ ఆరోపించారు. డ్రోన్ కేసులో మా రేవంత్ రెడ్డి ని జైలుకు పంపించిన కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెపుతాడని ఆయన ప్రశ్నించారు.






