Pot Water Benefits: మట్టి కుండ .. నిండా ఆరోగ్యం!

by Disha Web Desk 12 |
Pot Water Benefits: మట్టి కుండ .. నిండా ఆరోగ్యం!
X

దిశ, ఫీచర్స్ :వేసవిలో సాధారణ నీటితో దాహార్తి తీరడం కష్టం. శరీరం చల్లదనం కోరుకుంటుంది కాబట్టి ఐస్ వాటర్‌కే ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. ఈ నేపథ్యంలోనే ఇంటింటా ఫ్రిజ్ వాడకం కామన్ అయిపోయింది. కానీ ఫ్రిజ్‌లు అందుబాటులో లేని కాలంలో మట్టి కుండలే దిక్కు. ప్రస్తుతం ఈ పురాతన పద్ధతి అంతరించిపోతున్నప్పటికీ.. కుండలో సహజసిద్ధంగా చల్లబడే నీటితో దాహార్తి తీరడమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం!

సహజ శీతలీకరణ

మట్టి కుండలో నీటిని నిల్వ ఉంచడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. దీని ఉపరితలంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. ఈ బాష్పీభవన ప్రక్రియతో కుండ లోపలి నీరు వేడిని కోల్పోతుంది.

ప్రకృతిలో ఆల్కలీన్

మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా మారి టాక్సిన్స్ సృష్టిస్తుంది. కాగా బంకమట్టితో తయారయ్యే కుండ ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. కనుక ఇది ఎసిడిక్ ఫుడ్స్‌తో సంయోగం చెంది తగినంత pH బ్యాలన్స్‌ను కల్పిస్తుంది. తద్వారా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

జీవక్రియలో మెరుగుదల/వడదెబ్బ నివారణ

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. పైగా ఇందులోని మినరల్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు నీటిలోని ఖనిజాలు, పోషకాలను మట్టి కుండ చెక్కుచెదర నీయదు. కాబట్టి వేసవిలో ఈ నీరు తాగడం వల్ల బాడీ తొందరగా రీహైడ్రేట్ అవుతుంది. తద్వారా వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు.

గొంతు పట్టేయదు..

చాలామందికి ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల గొంతులో దురద, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మట్టి కుండలోని నీరు మాత్రం ఐడియల్ టెంపరేచర్ కలిగి ఉంటుంది. ఇది గొంతుకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఒకవేళ ఇదివరకే దగ్గుతో బాధపడుతుంటే ఆ సమస్యను తీవ్రతరం చేయదు.

సహజసిద్ధంగా శుద్ధి

మట్టి కుండలు నీటిని చల్లబరచడమే కాక సహజంగా శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి. ఈ కుండల్లోని పోరస్ మైక్రో-టెక్చర్ నీటిలోని కలుషితాలను అడ్డుకుని సురక్షిత తాగునీటి గా మారుస్తుంది.


Next Story

Most Viewed