హెచ్‌సీఏ టీజీ20 ఓ మాయాజాలం.. ఐపీఎల్‌కు రెడ్ అలర్ట్

by Malleboina Mahesh |

హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు దూరంగా ఉండాలంటూ టీసీఏ (TCA) సంచలన లేఖ!

హెచ్‌సీఏ టీజీ20 ఓ మాయాజాలం.. ఐపీఎల్‌కు రెడ్ అలర్ట్
X

దిశ,తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఐడీ దర్యాప్తు, హైకోర్టులో ఆటగాళ్ల పిటిషన్ల నేపథ్యంలో.. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరో బాంబు పేల్చింది. హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న టోర్నీ అని పేర్కోంటూ ఈ లీగ్‌తో అప్రమత్తంగా ఉండాలని, దీనికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ బీసీసీఐ సీఈవో, ఐపీఎల్ చైర్మన్, అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, అలాగే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు, టాలెంట్ స్కౌట్స్ కు టీసీఏ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి శుక్రవారం లేఖ రాశారు.

టోర్నీ ఓనర్‌షిప్ హక్కుల వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్..

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి, కనీస పారదర్శకత లేకుండా హెచ్‌సీఏ ఈ లీగ్‌ను నిర్వహిస్తోందని టీసీఏ ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ నిబంధనల ప్రకారం కనీస అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. వాణిజ్య ఒప్పందాలు, ఫ్రాంచైజీల కేటాయింపులు, టోర్నీ ఓనర్‌షిప్ హక్కుల వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని ఆరోపించింది. అసలు హెచ్‌సీఏ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, స్పాన్సర్లు, క్రీడాకారులు, వాటాదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ అంధకారంలో ఉంచి ఈ లీగ్‌ను నడుపుతున్నారని టీసీఏ ఫిర్యాదు చేసింది.

క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొంటే కెరీర్ నాశనమే..

ఈ లీగ్ పట్ల అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అప్రమత్తంగా ఉండాలని టీసీఏ విజ్ఞప్తి చేసింది. టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవద్దని, ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ ఎవరు ఆ లీగ్ వైపు చూడవద్దని హెచ్చరించింది. గుర్తింపు లేని ఈ లీగ్‌లో ఆడిన క్రీడాకారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ కాంట్రాక్టులు చేసుకోవద్దని సూచించింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు తమ వద్ద నమోదైన క్రికెటర్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ ఎవరూ టీజీ20లో పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరింది. ఒకవేళ ఏమాత్రం అవగాహన లేకుండా యువ క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొంటే.. భవిష్యత్తులో వారు బీసీసీఐ క్రమశిక్షణా చర్యలకు గురై, అనర్హత వేటు పడి వారి కెరీర్ నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

బీసీసీఐ బహిరంగ ప్రకటన చేయాలి: టీసీఏ

అనుమతులు లేని టోర్నీల వల్ల భారత క్రికెట్, బీసీసీఐ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటుందని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి పేర్కొన్నారు. స్పాన్సర్లు, క్రీడాకారులు, బ్రాడ్‌క్యాస్టర్లలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ.. తక్షణమే బీసీసీఐ రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. టీజీ20 లీగ్‌పై ఉన్నత స్థాయి విచారణ జరిపి, అసలు ఈ టోర్నీకి అనుమతులు ఉన్నాయా లేదా అన్నది స్పష్టం చేస్తూ బీసీసీఐ తక్షణమే ఒక బహిరంగ ప్రకటన చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు. భారత క్రికెట్ సమగ్రత, క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక లేఖను రాస్తున్నట్లు టీసీఏ స్పష్టం చేసింది.

Next Story