హెచ్‌సీఏ ఎన్నికల ఫలితాలు.. ట్రెజరర్‌గా అనిల్ కుమార్, సెక్రటరీగా జీవన్ రెడ్డి విజయం

by Malleboina Mahesh |

హెచ్‌సీఏ ఎన్నికల పోరు ముగింపు: ట్రెజరర్‌గా అనిల్ కుమార్ (61 ఓట్లు) విజయం. కార్యదర్శిగా ఏకగ్రీవంగా మన్నె జీవన్ రెడ్డి ఎన్నిక. ఎన్నికల అధికారి సంపత్ కుమార్ ధృవీకరణ పత్రాలు అందజేత.

హెచ్‌సీఏ ఎన్నికల ఫలితాలు.. ట్రెజరర్‌గా అనిల్ కుమార్, సెక్రటరీగా జీవన్ రెడ్డి విజయం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉప ఎన్నికల పర్వం ముగిసింది. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium)లో జరిగిన ఓట్ల లెక్కింపులో ట్రెజరర్ పదవికి (Treasurer's position) హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో అనిల్ కుమార్ తన సమీప ప్రత్యర్థి డాక్టర్ హరినారాయణ్‌పై రెండు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో అనిల్ కుమార్‌కు 61 ఓట్లు రాగా, హరినారాయణ్‌కు 59 ఓట్లు లభించాయి. బరిలో నిలిచిన ఇతర అభ్యర్థులు ఆగం రావుకు 26 ఓట్లు, బాబూరావుకు 6 ఓట్లు వచ్చాయి.

మరోవైపు, HCA కార్యదర్శి (Secretary) పదవికి మన్నె జీవన్ రెడ్డి (Manne Jeevan Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం కాలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి వి.ఎస్. సంపత్ కుమార్ విజేతలకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం హెచ్‌సీఏ అభివృద్ధికి, క్రికెట్ కార్యకలాపాల మెరుగుదలకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story