- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.49.75 లక్షలు గోదావరి పాలేనా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెంలో ఐటీసీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెంలో ఐటీసీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.49.75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు పూర్తయిన కేవలం నాలుగు నెలలకే బీటలు వారడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
చిన్నపాటి వర్షాలకే శిథిలావస్థ..
స్మశానవాటికకు వెళ్లే మార్గంలో చిన్న వంతెనతో పాటు నిర్మించిన ఈ రోడ్డుపై ఇప్పటివరకు భారీ లోడు వాహనాలు తిరగలేదని, గొర్రెల మందలు, అప్పుడప్పుడు ఒక ట్రాక్టర్ మాత్రమే ప్రయాణించినప్పటికీ అనేక చోట్ల రోడ్డు చీలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్డు ఈ పరిస్థితికి చేరితే, గోదావరి వరదల సమయంలో వారం రోజుల పాటు ముంపు ఏర్పడితే ఈ రహదారి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ లోపమా..? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..?
నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికుడు కాటం వెంకటరామరెడ్డి ఆరోపించారు. రోడ్డు పక్కన మట్టి నింపకపోవడం, రక్షణ గోడలు నిర్మించకపోవడంతో రోడ్డు అంచులు, కల్వర్టు భాగాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు.
రూ.1.70 కోట్ల పనులపైనా అనుమానాలు..
ఇదే కాంట్రాక్టర్‌కు ఐటీసీ యాజమాన్యం రూ.1.70 కోట్ల విలువైన కళ్యాణ మండపం నిర్మాణ పనులు కూడా అప్పగించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ రహదారి మాదిరిగానే ఆ నిర్మాణం కూడా నాణ్యత లేకుండా ఉంటే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐటీసీ యాజమాన్యం, గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి రోడ్డును పరిశీలించాలని, నాణ్యత లోపించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవసరమైతే కాంట్రాక్టర్‌ను మార్చి పనులను బాధ్యతాయుతమైన సంస్థకు అప్పగించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని కాటం వెంకటరామరెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధుల పేరుతో ప్రజాధనాన్ని వృథా కాకుండా చూడాలని, సంబంధిత అధికారులు, ఐటీసీ ప్రతినిధులు వెంటనే విచారణ జరిపి లోపాలను సరిదిద్దడంతో పాటు అవసరమైన పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.






