సిట్ అంటే.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌

by Gantepaka Srikanth |

సింగరేణిలో సోలార్ పవర్ స్కాం జరిగిందని.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు.

సిట్ అంటే.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిలో సోలార్ పవర్ స్కాం జరిగిందని.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు వేరువేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టేందుకు తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని అన్నారు. ఎంఎస్ఎంఎల్ఈలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎత్తుకపోవడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ కండీషన్‌ను పెట్టారని పేర్కొన్నారు. వారు అనుకున్న వారికి రూ.250 కోట్ల అదనంగా వచ్చేలా ఈ టెండర్లను కట్టబెట్టారని.. ఈ టెండర్‌ను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. దేశవ్యాప్తంగానూ సోలార్ పవర్‌పై టెండర్లు కొనసాగుతున్నాయని.. ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి మూడున్నర కోట్లు అవుతుందని.. పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందని తెలిపారు. కానీ.. ఇక్కడ సింగరేణి భూమిలో సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాటుకు రూ.5కోట్ల 4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతున్నదని ఆరోపించారు. రూ.540 కోట్ల ఈ టెండర్‌ను వారికి కావాల్సినవారికి కట్టబెట్టారని పేర్కొన్నారు.

సోలార్ పవర్ స్కామ్

సింగరేణి దాదాపు రూ.200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగిందనని అన్నారు. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లోనూ అవినీతి జరిగిందని అన్నారు. దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టబెట్టారని.. నేషనల్ ఆవరేజ్ కంటే ఇది డబుల్ కాస్ట్ అని చెప్పారు. రూ.480 కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని తెలిపారు. అక్కడ రూ.250 కోట్లు.. ఇక్కడ రూ.250 కోట్లు నేరుగా చేతులు మారాయని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్‌కి వెళ్లి శనివారం రివ్యూ చేస్తున్నారని తమకు సమాచారం ఉన్నదని.. బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయిందని.. ఢిల్లీ కిషన్‌రెడ్డి గల్లీకి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని ఈ మేరకు కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

జిలేటిన్ స్టిక్స్ కొనుగోలులో ఒత్తిడి

సింగరేణిలో ఎక్స్‌ప్లోజింగ్ స్కాం సైతం జరిగిందని.. జిలేటిన్ స్టిక్స్ కొనుగోలులో 30శాతం రేటు అదనంగా పెట్టి కొనాలని ఒత్తిడి తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్ 30శాతం ఎక్కువ రేటుకు కొనడానికి నిరాకరించారని.. ఒత్తిడి చేస్తే చివరికు రాజీనామా చేసి వెళ్లిపోయారని అన్నారు. తర్వాత ఇంకో డైరెక్టర్ వీకే శ్రీనివాస్ కూడా సంతకం పెట్టనని నిరాకరిస్తే ఆయనను డైరెక్టర్ నుంచి జీఎం పదవికి రివర్స్ చేశారన్నారు. ఇలా బెదిరించి భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కాంకు తెరదీస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం ఖని స్కాంలోనూ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్‌ను పిలిచారన్నారు. ఫిబ్రవరి 2న లాస్ట్ డేట్ ఉన్నదని.. ఇక్కడ కూడా రింగు చేస్తున్నారని ఆరోపించారు. రూ. 1,044 కోట్లతో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ టెండర్‌ను పిలిచారని.. ప్రకాశం గని టెండర్‌ను సైతం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. శ్రీరాంపూర్‌లో ఓబీ టెండర్లలోనూ స్కాం జరిగినట్లు చెప్పారు. రూ.600 కోట్ల వర్క్ టెండర్ పిలిచారని.. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడుసార్లు డేట్ ఇచ్చి వాయిదా వేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి చెబితే ఫైనాన్షియల్ బిడ్ వాయిదా వేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ హోటల్‌లో సృజన్‌రెడ్డి సెటిల్మెంట్లు కుదరకపోవడం వల్ల వాయిదా వేశారని ఆరోపించారు. దీనిపైనా కిషన్‌రెడ్డి విచారణ చేపట్టాలన్నారు. ఆరు ఓబీ కాంట్రాక్టర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్‌లోనూ అవకతవకలు జరిగాయని.. త్వరలో సమాచారం బయట పెడతానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే వెంటనే సృజన్‌రెడ్డిపై సిట్ వేయాలని.. సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే కిషన్‌రెడ్డి ఇప్పటివరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సృజన్‌కు సిరుల గనిగా సింగరేణి

సీఎం బావమరిది సృజన్‌రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సిట్ అంటే స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని ఆరోపించారు. వరుసగా మీడియాకు లీకులు ఇస్తున్నారన్నారని.. ఆ లీకులకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులు వేరు.. ఇస్తున్న లీకులు వేరని తెలిపారు. తాను విచారణకు వెళ్ళినప్పుడు తనపై ఇలాంటి దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఒకరకంగా ఇది రాజ్యాంగం మీద దాడి అని.. వ్యక్తిత్వ హననం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు, డ్రామాలు చేస్తున్నదని అన్నారు. రేవంత్‌రెడ్డి పిరికితనానికి నిదర్శనమని.. చాతకాని వాళ్ళు చేసే పని అని అన్నారు. రేవంత్‌కు ధైర్యం ఉంటే వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సిరుల గని సింగరేణి అని.. కానీ.. సింగరేణి సృజన్ గనిగా మారిపోయిందని ఆరోపించారు. ఈ స్కాం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై సిట్ల డ్రామా నడిపిస్తున్నదని అన్నారు.

రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టం

‘రిటైర్మైంట్ అయినా వదిలిపెట్టం.. ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తం. చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు, పోలీసులు జాగ్రత్త’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. వారికి ఏమాత్రం సహకరించమని అన్నారు. సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ పోలీసు‌స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి తమ మీద ప్రయత్నాలు చేస్తున్నారని.. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవర్నీ వదిలి పెట్టే ప్రశ్నే లేదన్నారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా విడిచేది లేదన్నారు. దావోస్ నుంచి రేవంత్‌రెడ్డి ఇచ్చే డైరెక్షన్‌లో కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించారు.

Next Story