- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌కు అన్నీ కలిసొస్తున్నాయి: హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ఆర్భాటాన్ని చూస్తే జాలేస్తోందని బీఆర్ఎస్ ముఖ్య నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ఆర్భాటాన్ని చూస్తే జాలేస్తోందని బీఆర్ఎస్ ముఖ్య నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ మేరకు హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయి. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్న నేటి మీ సభ మీరు చెప్పినట్లే.. చరిత్రలో నిలబడుతుంది.
ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు
కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారు. 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేసారు. ప్రాజెక్టుకు కాలువల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని మీరు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని మీరు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నారు?. రెండేళ్లుగా భూమి సేకరించకుండా, కాలువలు తవ్వకుండా.. ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈపాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవి. 1.5 TMCల సామర్థ్యంతో కేసీఆర్ రూ. 500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారు. రెండేళ్ల క్రిందనే 18 వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకున్నా రైతులకు తీరని అన్యాయం చేశారు.
సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తారా?
ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట. ఈ రెండేళ్ల కాలం వృథా చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శనం. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారింది. లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సి.రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమే. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్. ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా?. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారు?. తమ్మిడిహట్టి పేరు మీద అప్పుడు ఆరేండ్లు, ఇప్పుడు రెండేళ్లు కాలయాపన చేసారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి నిందలు
మాయ మాటలు చెప్పి అదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రావిటీ కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని మమ్మల్ని విమర్శించిన మీరు ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపండి. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చిత్తశుద్ది గల్ల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదు. రెండేళ్లలో చేసిందేం లేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి నిందలు మోపుతున్నారు. ఎనుముల ఫ్యామిలీ అభివృద్ధి కోసం రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే అని కాగ్ రిపోర్ట్‌తో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పినా ఎందుకు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్దాలే, ఇప్పుడు అధికార పక్షంలో అబద్దాలే... జీవితమంతా అబద్దాలేనా?. రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కాల్వ తీయలేదు, ఒక్క చెరువు తవ్వలేదు, ఒక్క హామీ నిలబెట్టుకోలేదు, తెచ్చిన అప్పులతో ఏం చేసావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే మా జోగు రామన్నను, బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎందుకు ఉదయం నుంచి అరెస్టులు చేశారో చెప్పాలి. అరెస్టులు చేపిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగడం అన్ని రోజులు సాధ్యం కాదు. 'చీప్' మినిస్టర్ రేవంత్ రెడ్డి.. పరిపాలన అంటే కేవలం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాల మీద మీ పేరు చెక్కించుకోవడం కాదు, ప్రజల మనోఫలకాల మీద మీ ముద్ర వేసుకునేలా పని చేయడం అని ఇప్పటికైనా గ్రహించండి’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.






