- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ రాజన్న మీద ఒట్టేసి చెప్పు: హరీష్ రావు
జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్.. నెలకు ఒక స్కామ్‌తో స్కాం క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్.. నెలకు ఒక స్కామ్‌తో స్కాం క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారని.. ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని ఆరోపించారు. జనవరిలో సివిల్ సప్లైస్ స్కాం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కాం, మార్చిలో సాండ్ స్కాం, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కాం, మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కాం, జూన్‌లో ఫోర్త్ సిటీ స్కాం, జూలైలో లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కాం, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కాం, సెప్టెంబర్‌లో హిల్ట్ పి ఇండస్ట్రియల్ స్కాం, అక్టోబర్‌లో పవర్ స్కామ్, నవంబర్‌లో సింగరేణి స్కాం, డిసెంబర్‌లో సీఎం, కేఎల్ఎస్ఆర్ స్కాం అమలు చేశారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ, రేవంత్ పాలనలో నెలకొక స్కాం మాత్రం పక్కాగా జరిగిందన్నారు.
సభ్యసమాజం ఛీ కొడుతున్నది..
అమెరికా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉండొచ్చు కానీ సీఎం హోదాలో మాట్లాడుతున్న వికృత భాషను చూసి సభ్య సమాజం ఛీకొడుతున్నదని అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తే ఇలా చిల్లర మాటలు మాట్లాడటం దారుణమన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు అని.. కేసీఆర్‌ను జాతిపిత అన్నందుకు రేవంత్ కడుపులో ఉన్న విషమంతా కక్కుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షను నిజం చేసిన జాతిపితగా పిలుచుకుంటారని తెలిపారు. రేవంత్‌రెడ్డి కంటే తాము పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలమని.. కానీ బాధ్యత గల శాసనసభ్యులుగా, పౌరులుగా సంస్కారం ఉండడంతో దిగజారి మాట్లాడటం లేదన్నారు. ప్రతి ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉంటుందని.. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ చరిత్రలో బూతుల సీఎంగా నిలిచిపోతారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ఏనాడూ ఉద్యమంలో లేడు
రెండున్నర సంవత్సరాల పాలనలో ఆయన చేసింది ఏమీ లేదని.. రాష్ట్రంలో తెచ్చిన మార్పు అంతకంటే లేదని అన్నారు. తన పాలనపై తనకే సంతృప్తి లేక, తన చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బూతు భాషను ఎంచుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ మేధావులు స్పందించాలని.. మేధావుల మౌనం దేశానికి, రాష్ట్రానికి ప్రమాదమని తెలిపారు. పాలనను గాలికి వదిలి బూతులతో కాలం వెళ్లదీస్తున్న రేవంత్‌రెడ్డి తీరును ఖండించాలన్నారు. ఈ సీఎం తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై చేస్తున్న దాడి అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏనాడూ ఉద్యమంలో లేడని, ఏనాడూ జై తెలంగాణ అనలేదని.. పైగా ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఏ రకంగా అదుపుతప్పి మాట్లాడుతున్నారో కొడంగల్ ప్రజలు సైతం ఆలోచించాలని సూచించారు. గురుకులాల్లో పాముకాట్లతో, కరెంట్ షాక్‌లతో, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే ఏరోజైనా స్పందించారా? అని ప్రశ్నించారు. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి ఆలోచన చేశారా? అని అన్నారు. ఇవేవీ మాట్లాడని సీఎం.. కేవలం కేసీఆర్ త్యాగాన్ని, కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమన్నారు.
కుంభకోణాలను ప్రశ్నిస్తే తిట్ల దండకం
సీఎం కుంభకోణాల గురించి తాము ప్రశ్నిస్తే వాటిని కప్పిపుచ్చుకోవడానికి తిట్ల దండకం అందుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. స్కీములు అడిగితే డైవర్షన్, హామీలు అడిగితే డైవర్షన్ చేస్తున్నారని.. ఇలా ప్రతిసారి చేస్తానంటే ప్రజలే సీఎం పదవి నుండి డైవర్షన్ చేస్తారు బిడ్డ జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. తాము 11.5 కి.మీ. పనులు పూర్తి చేశామని చెప్పారు. ఈ రెండున్నర ఏళ్లలో ఈ ప్రభుత్వం కనీసం 100 మీటర్ల పనులు కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ అవినీతి, అనాలోచిత చర్యల వల్లే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు కుప్పకూలాయని.. ఆ ప్రమాదంలో చిక్కుకున్న శవాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. నల్గొండ ఫ్లోరైడ్ పాపానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. నల్గొండ పట్టణాన్ని రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేసింది కేసీఆర్ అని తెలిపారు. దావోస్ వెళ్లి వచ్చినా ఎన్ని పెట్టుబడులు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో రేవంత్‌రెడ్డి చెప్పలేదని ఆరోపించారు.
వేములవాడ రాజన్న మీద ఒట్టేసి చెప్పు
కనీపం ప్రెస్‌మీట్ సైతం పెట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని.. మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా ఇచ్చింది రేవంత్ కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రిగా వచ్చిన మెజారిటీ, ఎంపీ ఎన్నికల్లో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకులు వచ్చి ఆర్ఆర్ టాక్స్ అని అవినీతి గురించి మాట్లాడతారు తప్ప, ఎలాంటి ఎంక్వైరీ చేయరని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్-బీజేపీల చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా అని నిలదీశారు. రుణమాఫీ గురించి వేములవాడ రాజన్న మీద ఒట్టేసి చెప్పారని.. ఎక్కడ పూర్తి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. అదే చొప్పదండిలో ఎక్కడికి రమ్మంటావో చెప్పు లేదా కొడంగల్‌కి రమ్మంటావా చెప్పు ఎక్కడ పూర్తి రుణమాఫీ చేశావో చూపించు రేవంత్‌రెడ్డి అని సవాల్ విసిరారు.






