- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే నిరుద్యోగుల అరెస్టులా.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ధ్వజం
జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే విద్యార్థులను, నిరుద్యోగులను అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: జాబ్ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే విద్యార్థులను, నిరుద్యోగులను అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. నిన్న దిల్‌సుఖ్‌నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమనకాండ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి, పొర్లు దండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడిపినవారే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కుపాదం మోపి తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతోందని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి..
‘ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న’ అన్నట్లు ఎన్నికల ముందు నిరుద్యోగులకు గుడ్డి గుండెలు చూపి, అధికారంలోకి వచ్చాక లాఠీఛార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చారని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన జరిగిందని ఆరోపించారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లబోస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీఛార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగిలే నిరసన జ్వాలలను చల్లార్చలేరని అన్నారు. ఇవాళ నిరసనలో గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలని, దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలను ఆపి, వెంటనే నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగులను లాకప్‌లో హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.






