- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం : హరీష్ రావు
తాము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఫార్మాసిటీ కోసం నా సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చాను. ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన మొదటి వ్యక్తిని నేనే. ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీకి వెళ్లిపోయాయి. ఫార్మాసిటీ వస్తే రాష్ట్రానికి భారీగా ఆదాయం వచ్చేది. కానీ, రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతోపాటు ఇక్కడి పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా పోయాయి’ అని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. జర్నలిస్టులకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని భూములు ఎన్నో ఉన్నాయని.. వాటిని ఇవ్వాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామంటే తామేమీ వ్యతిరేకించడం లేదని.. కానీ అక్కడ ఇప్పటికే కొందరు రైతులు కేసులు వేశారని.. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేని భూములు జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిందని చెబుతున్నప్పుడు, జర్నలిస్టులకు ఆ పాత భూములే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డువచ్చినప్పుడు.. ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి ఆ తీర్పు అడ్డురాదా అని నిలదీశారు. తాను మళ్లీ మళ్లీ స్పష్టంగా చెబుతున్నానని.. తాము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
రూ.2వేల కోట్ల భారీ కుంభకోణం
కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే బడుల ప్రారంభం వాయిదా వేశారని.. విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు.. షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్ క్యాప్‌నకు ఇచ్చామని.. రేవంత్‌రెడ్డి వాటిని సెంట్రలైజ్ చేసి, మన వాళ్ల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని.. 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, నోట్ బుక్స్ ఏవీ ఇంకా అందలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి వేల కోట్ల అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం ఏకంగా దళారులను పెట్టుకున్నదని.. రాష్ట్రం ఇచ్చిన వందల కోట్ల కమీషన్లతో ముంబై బ్రోకర్ విమానం కొనుగోలు చేశారని పేర్కొన్నారు. రైతులకు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వానికి.. సీఎం వంద కోట్ల గెస్ట్‌హౌస్‌కు, నెలకు 5 కోట్ల హెలికాప్టర్ షికార్లకు డబ్బులెక్కడివని ప్రశ్నించారు.
మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు
కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడి వెన్నుపోటు కుట్ర ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్రే దాగి ఉన్నదని.. ఈ నామినేషన్ తప్పుల గురించి లీకులు ఇచ్చింది ఎవరో రేవంత్‌రెడ్డి వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు తమకు పక్కా సమాచారం ఉన్నదని ఆరోపించారు. కేసీఆర్ అత్యద్భుతమైన సెక్రెటేరియట్ నిర్మిస్తే, అక్కడికి వెళ్లని రేవంత్‌రెడ్డి.. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని అన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నారని.. జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ.100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను, కుటుంబ సభ్యులతో సోఫాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ.7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ.100 కోట్లకు పెంచారన్నారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ రూ.17 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్‌బాల్ ఆడుకోవడానికి రూ.10 కోట్లతో స్టేడియం నిర్మిస్తూ ముఖ్యమంత్రి సోకులు పడుతున్నారని అన్నారు. సీఎం తన విలాసాలకు క్యాంపు కార్యాలయాలు కడుతుంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి.. వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. రాష్ట్రంలో డబ్బులు లేవనడం పచ్చి అబద్ధమన్నారు. మొన్నటివరకు నెలకు రూ.2 కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు నెలకు ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించి మరీ కొత్త హెలికాప్టర్‌లో సీఎం షికార్లు చేస్తున్నారని అన్నారు.
ఔటర్ లోపల ఉన్న 111 జీవోను ఎత్తివేసేలా సెక్రెటేరియట్‌లో పెద్ద ఎత్తున ఫైళ్లు నడుపుతున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండటం వల్లే విద్యావ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా మారిందన్నారు. చివరకు విద్యార్థులు తినే కోడిగుడ్డులో కూడా అవినీతి చేయడం దారుణమని.. పేద పిల్లలు చదివే గురుకులాల్లో ఇలా కమీషన్లు కొడితే దేవుడు కూడా క్షమించడని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రిపోర్ట్ ఇస్తే.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూకేజీ అని రకరకాల కట్టుకథలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. తాము నిజంగానే చెల్లని నోటు అయితే, తమ గురించి నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నారని ప్రశ్నించారు. సీపీఐ గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.






