- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్.. అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేవు : హరీష్ రావు
తెలంగాణలో కృష్ణా నదీ జలాల వినియోగం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం పీక్ స్టేజీకి చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కృష్ణా నదీ జలాల వినియోగం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం పీక్ స్టేజీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సాక్ష్యాలతో కూడిన సుదీర్ఘమైన విమర్శనాస్త్రాన్ని సంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస అవగాహన లోపించడం వల్లే తెలంగాణ జల హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మే 2న నాడు తెలంగాణ ఈఎన్సీ (ENC) జనరల్ కృష్ణా బోర్డుకు (KRMB) రాసిన అధికారిక లేఖను బహిర్గతం చేస్తూ.. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల్లో ఏపీ ఏకంగా 74.23 శాతం నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 25.77 శాతానికే పరిమితమైందని, ఈ లెక్కలు చూసైనా ముఖ్యమంత్రి తన అబద్ధాల ప్రచారాన్ని ఆపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతున్నా ఇరిగేషన్ అంశాలపై పాలకులు ఇంకా అవగాహన పెంచుకోకపోవడం పాలమూరు ప్రాంతానికే కాకుండా, యావత్ తెలంగాణ దురదృష్టమని ఆయన ఆక్షేపించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తలరాతను మార్చే 12.30 లక్షల ఎకరాల సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఇదే ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో అడ్డగోలుగా కేసులు వేసి అడ్డుకున్నప్పటికీ, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి 27,191 ఎకరాల భూసేకరణను విజయవంతంగా పూర్తి చేసి పనులను పరుగులు పెట్టించిందని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాటు కుంభకర్ణ నిద్ర పోయి, సగం పాలనా కాలం వృథా అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా భూసేకరణ ప్రతిపాదనలు అనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఏడాదికి 6 లక్షల ఎకరాల చొప్పున రెండేళ్లలో 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నంత సులువుగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు కట్టలేరని హితవు పలికారు.
గత సమైక్య పాలనలో వలసలు, ఆకలి చావులతో తల్లడిల్లిన పాలమూరును సస్యశ్యామలం చేసింది కేసీఆర్ మాత్రమేనని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించామని హరీష్ రావు స్పష్టం చేశారు. 2014 వరకు కాంగ్రెస్, టీడీపీల పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ద్వారా కేవలం 27 వేల ఎకరాలు మాత్రమే సాగవ్వగా.. తాము వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని విస్తరించామని గణాంకాలతో వివరించారు. చివరకు ఆర్డీఎస్ (RDS) ఆయకట్టు ఎండిపోతుంటే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులను ఆదుకున్నది తామేనని పేర్కొన్నారు. ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో కనీసం తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క కొత్త చెక్ డ్యాం కూడా కట్టకుండా కేసీఆర్ గారిపై విమర్శలు చేయడం చేతగానితనమేనని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వారు అదే అబద్ధాలతో ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేరని ఈఎన్సీ లేఖను జత చేస్తూ హరీష్ రావు హెచ్చరించారు.






