పాలమూరు గడ్డపై రేవంత్ అబద్ధాలు.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం

by Ramesh Naini |

పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాలమూరు గడ్డపై రేవంత్ అబద్ధాలు.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా? ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. రూ.52,121 కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ, అసలు కింద చెల్లించామని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే ఆ వివరాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక టీఎంసీకి వరి వేస్తే ఆరు వేల ఎకరాలు, ఒక టీఎంసీకి వేరుశనగ, మిర్చి, ఉద్యాన పంటలు, మొక్కజొన్న పంటలు వేస్తే పదివేల ఎకరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ ఉపయోగించి పంటలు పండిస్తే 15 వేల ఎకరాలుగా లెక్క కడతారని.. కానీ, రేవంత్ మాత్రం ఒక టీఎంసీకి గతంలో పది వేల ఎకరాలుగా, ఇప్పుడు 15 వేల ఎకరాలుగా లెక్కకడుతున్నారని చెప్పడం మరో పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇదే మాట కేంద్ర జల సంఘం సమావేశాల్లో చెబితే పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుందని సూచించారు.

దశాబ్దాలపాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసింది కేసీఆర్ అని తెలిపారు. ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులే అని.. ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా తదితర పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని కాలువలు తవ్వి పంపులు, లిఫ్టు పనులను గాలికి వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించారు. భూసేకరణ చేయలేదని చెప్పడం సిగ్గుచేటని.. ఆర్టీఐలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసి వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్‌రెడ్డి అని.. ప్రాజెక్టుల మీద, పాలమూరు మీద ఆయనకున్న అవగాహన శూన్యమని ఎద్దేవా చేశారు.

Next Story