- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ద దంపతులకు ఇళ్లు అప్పగింత
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు పంపించిన కుమారుడి విషయంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, మిర్యాలగూడ టౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు పంపించిన కుమారుడి విషయంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల సంరక్షణ చట్టం–2007 ప్రకారం వారి ఇంటిని తిరిగి వారికి అప్పగించాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసించే ఇంజం చంద్రకళ, రమణారెడ్డి వయో వృద్ధ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తమ పిల్లలందరికీ విద్యాభ్యాసం, వివాహాలు తదితర బాధ్యతలను ఈ దంపతులు నిర్వర్తించారు. వారి పేరు పై మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇల్లు ఉంది. అయితే, గత ఐదేళ్లుగా వారి కుమారుల్లో ఒకరు ఆ ఇంటిలో నివసిస్తూ, తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పక్షవాతం, మోకాళ్ల శస్త్రచికిత్స తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ దంపతులు న్యాయం కోసం ఆర్డీవో ట్రిబ్యునల్, అప్పీలేట్ ట్రిబ్యునల్‌లను ఆశ్రయించి, సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఫిర్యాదు చేశారు.
వృద్ధ పౌరుల చట్టం–2007 ప్రకారం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ గత నెల 15వ తేదీన ఆ ఇంటిని తిరిగి వృద్ధ దంపతులకు స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు స్థానిక ఆర్డీవో ఎస్. రమణారెడ్డి వివిధ శాఖల సమన్వయంతో గత నెల 23వ తేదీన అమలు చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల అమలులో భాగంగా శనివారం మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, సీఐ నాగభూషణం, తహసీల్దార్, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఆ ఇంటిని వృద్ధ దంపతులకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సైదులు, అనిల్ కుమార్, గోపమ్మ, మున్సిపల్ సిబ్బంది సాజిద్, సాంబయ్య, రాములు, నాగిరెడ్డి, నవీన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






