- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోరు మంచిదైతే.. కాపురం చక్కబడుతుంది : డీజీపీ సీవీ ఆనంద్
చిన్నచిన్న మనస్పర్ధలతో విడిపోవాలనుకునే దంపతులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలోని మీ సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది.

- గృహహింస బాధితులకు మీ సురక్ష కొండంత అండ
- భార్యాభర్తల మధ్య కలహాలు రావద్దంటే మాటతీరు బాగుండాలి
దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నచిన్న మనస్పర్ధలతో విడిపోవాలనుకునే దంపతులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలోని మీ సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది.సంసారంలో భార్యాభర్తల మధ్య కలహాలు రావద్దంటే ఇద్దరి మాటతీరు మంచిదై ఉండాలి. నోరు మంచిదైతే కాపురం చక్కబడుతుంది అని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మహిళల భద్రత, కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ఉమెన్ సేఫ్టీ వింగ్, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేటలో శనివారం మీ సురక్ష కలసి ఉంటే కలదు సుఖం సదస్సును నిర్వహించారు.
సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..
ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మట్లాడుతూ.. నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం ఎంతో అవసరమని డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల భద్రత, వారి సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని ఆయన గుర్తుచేశారు. ఇందుకోసం ప్రభుత్వం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, షీ షటిల్స్, సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మహిళల భద్రతను మరింత బలోపేతం చేసిందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా విడిపోతున్న కుటుంబాలను తిరిగి కలపడంలో మల్కాజిగిరి కమిషనరేట్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఓపిక, విశ్వాసమే పునాది: డీజీ చారు సిన్హా..
సదస్సులో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. వైవాహిక బంధం నిలబడాలంటే భార్యాభర్తలిద్దరిలో ఓపిక, ఒకరిపై ఒకరికి విశ్వాసంతో పాటు పరస్పర అవగాహన ఎంతో అవసరమని సూచించారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో భరోసా కేంద్రాలు, కౌన్సెలింగ్ సెంటర్లు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. వివాహం అనేది పరస్పర గౌరవం, అవగాహనపై ఆధారపడిన ఒక గొప్ప సామాజిక వ్యవస్థ అని తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ హెడ్ శ్రీమతి ఎస్.ఎన్. శ్రీదేవి అన్నారు.
9,700కు పైగా కేసుల పరిష్కారం : సీపీ సుమతి
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ.. తమ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 9,700కు పైగా కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించాం. 32,000కు పైగా సెషన్లు నిర్వహించాం. సీడీఈడబ్ల్యూ సేవలపై 90 శాతానికి పైగా బాధితులు సంతృప్తి వ్యక్తం చేయడం గర్వకారణం అని వివరించారు.
సంతోషంలో 150 జంటలు
కుటుంబ కలహాలతో విడిపోయి, పోలీసుల కౌన్సెలింగ్ మరియు మధ్యవర్తిత్వంతో తిరిగి ఒక్కటైన 150కి పైగా దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంపతులు తమ అనుభవాలను వేదికపై పంచుకుంటూ, తమ కాపురాన్ని నిలబెట్టిన కౌన్సెలర్లు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరిగి కలిసిన దంపతులకు డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన సీడీఈడబ్ల్యూ కేంద్రాల సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మై ఛాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి పెర్ల్ చోరగుడి, మల్కాజిగిరి మహిళా భద్రత డీసీపీ టి. ఉషారాణి, సీనియర్ పోలీస్ అధికారులు, షీ టీమ్స్, భరోసా కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






